తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రెండు రోజుల పాటూ వర్ష సూచన

Siva Kodati |  
Published : Mar 20, 2022, 03:13 PM IST
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రెండు రోజుల పాటూ వర్ష సూచన

సారాంశం

బంగాళాఖాతంలో అండమాన్ వద్ద ఏర్పడిన అప్పపీడనం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, పుదుచ్చేరిలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.   

వేసవి తాపం, వేడిగాలులతో అల్లాడుతోన్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అండమాన్‌ తీరం దగ్గర ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటూ ఒడిశా తీరంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో ఈ నెల 20 వరకు వర్షాలు, మంచు కురుస్తుందంటున్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ నెల 18 నుంచి 20 వరకు .. ఏపీ, తెలంగాణల్లో ఈ నెల 20, 21న తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు.. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా పరిణమించి రానున్న 48 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని  IMD హెచ్చరించింది. గత రెండు రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మార్చి 21 నాటికి తీవ్ర తుపానుగా మారనుందని దీని ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోల్లం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీనికి అసానిగా నామకరణం చేశారు. అండమాన్ నికోబార్ దీవులపై దీని ప్రభావం వుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈక్రమంలో గత నాలుగు రోజులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా..అండమాన్ నికోబార్ దీవుల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు. ద్వీప సమూహంలోని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించడంతో సహా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు

ఇక వర్షాల సంగతి పక్కనబెడితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతుండటంతో పాటు ఉక్కపోతకు వేడిగాలి కూడా తోడవ్వడంతో ప్రజలు అల్లాడుతున్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శనివారం రాయలసీమ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 42 డిగ్రీల దాక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్