చంద్రబాబును చాలెంజ్ చేసిన వీర్రాజు

First Published Dec 19, 2017, 1:03 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు భాజపా నేత సోము వీర్రాజు సవాలు విసిరారు.

చంద్రబాబునాయుడుకు భాజపా నేత సోము వీర్రాజు సవాలు విసిరారు. ‘భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దని చంద్రబాబును చెప్పమనండి’ అంటూ ఛాలెంజ్ చేసారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపిలో భాజపా బలోపేతమైతే తప్పేంటి? అంటూ టిడిపిని నిలదీసారు. టిడిపి బలోపేతమవ్వటానికి వైసిపి నుండి ఎంఎల్ఏలను లాక్కోగా లేంది, కాకినాడ కార్పొరేషన్లో వైసిపి నేతలను అరువు తెచ్చుకోంగా లేంది భాజపా బలపడితే తప్పేంటి అంటూ మండిపడ్డారు.

భాజపాను టిడిపి నేతలు ఐస్ క్రీమని, లాలీ పాప్ అని వ్యాఖ్యలు చేయటంలో అర్ధమేంటంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబును తామెంతో అభిమానించినా, ప్రేమించినా తమను మాత్రం మిత్రపక్షంగా టిడిపి మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. టిడిపితో కలిసి పోటీ  చేసినప్పటికన్నా ఒంటిరిగా పోటీ చేసినపుడే తమకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు చెప్పారు. తమ పార్టీ బలోపేతమైన తర్వాత తమ నేతలకు, కార్యకర్తలకు అందరికీ న్యాయం చేస్తామన్నారు. అందులో భాగంగానే 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు ప్రకటించారు.

కాగా భాజపా నేతపై టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపైనే వీర్రాజు మండిపడ్డారు. తమ దయాదాక్షిణ్యాలపైనే భాజపా ఆధారపడిందని ఎంఎల్సీ చెప్పటంతో వివాదం మొదలైంది. ఏపిలో భాజపా బలోపేతమవుతుందని కలలు కంటున్నట్లు టిడిపి ఎద్దేవా చేసింది. తమ సహకారం లేకుంటే భాజపాకు ఇపుడున్న నాలుగు సీట్లు కూడా రావన్నారు. ఏపిలో భాజపాకు అంత సీన్ లేదని కుండబద్దలు కొట్టినట్లు రాజేంద్రప్రసాద్ చెప్పటంతో భాజపా నేతలందరూ మండిపోతున్నారు. గుజరాత్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఇరుపార్టీల నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

click me!