Simhachalam: సింహాచలం దుర్ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. విచార‌ణ‌కు ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు

Published : Apr 30, 2025, 01:17 PM IST
Simhachalam: సింహాచలం దుర్ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. విచార‌ణ‌కు ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు

సారాంశం

Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు  చేప‌ట్టారు. 72 గంట‌ల్లో ప్రాథ‌మిక నివేదిక అందించాల‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు.   

Simhachalam: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో బుధవారం వార్షిక ఉత్సవం (చందనోత్సవం)లో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

సింహాచలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షం కారణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం. బుధవారం ప్రారంభం కానున్న వార్షిక పండుగ చందనోత్సవం సందర్భంగా దర్శనం కోసం టిక్కెట్లు కొనడానికి క్యూలో నిలబడి ఉన్న స‌మ‌యంలో భక్తులపై గోడ కూలిపోయింది. వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, ఇతర విభాగాల సహాయంతో సహాయక చర్యలను చేపట్టింది.

 

సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌.. 72 గంట‌ల్లో ప్రాథ‌మిక నివేదిక అందించాల‌ని ఆదేశాలు 

 

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సంఘటనపై అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఘటనపై సమగ్ర విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీను ఏర్పాటు చేస్తూ, 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్‌చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు.

అలాగే, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్, ఎంపీ భరత్, సింహాచలం దేవస్థానం ధర్మకర్త అశోక్ గజపతి రాజుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

సింహాచలం ప్ర‌మాదం బాధితుల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు 


సింహాచ‌లం ప్ర‌మాద బాధితుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. దేవాదాయశాఖ పరిధిలో ఆలయాల్లో బాధిత కుటుంబాలకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామ‌ని చెప్పారు.  భక్తులపై గోడ కూలిపోవడంతో బాధాకరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం