
ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం. అందుకు అవకాశం ఇవ్వకూడదని అధికారపక్షం. ఫలితంగా సభలో గందరగోళం, రెండు సార్లు సభ వాయిదా. ఇది ఈరోజు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న తీరు. స్ధలం మారిందేగానీ పద్దతిలో మాత్రం ఏం మార్పు కనబడలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని అంశాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతుండగా స్పీకర్ రెండు సార్లు మైక్ కట్ చేసారు. పోలవరం ప్రాజెక్టు, పేదలకు గృహ నిర్మాణ పథకం అమలు తదితర అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసారు. అయితే ప్రభుత్వం సక్రమంగా సమాధానం చెప్పకుండా జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్నది.
భారీ సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో ప్రభుత్వం చేసిన కేటాయింపులను జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు. అదేవిధంగా పేదలకు ఇళ్ళ నిర్మించే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రశ్నించారు. చేనేతల సంక్షేమంపై మండిపడ్డారు. ఇలా జగన్ ప్రసంగం సాగుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేయటం వైసీపీకి ఆగ్రహం తెప్పించింది. అయితే, సుదీర్ఘ ప్రసంగాలు చేస్తే తాను అనుమతించనంటూ స్పీకర్ స్పష్టం చేసారు. ఒకవైపు మంత్రులకు, అధికార పార్టీ సభ్యుల మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్ జగన్ మాట్లాడేటప్పుడే ఎందుకు మైక్ కట్ చేస్తున్నారంటూ వైసీపీ నిలదీస్తోంది. రెండు వైపుల గోల మొదలవ్వటంతో స్పీకర్ రెండోసారి కూడా సభను వాయిదా వేసారు.
ప్రతిపక్షమన్నాక ప్రభుత్వంపై ఆరోపణలే చేస్తుంది. పథకాల అమలులో లోపాలనే ఎత్తి చూపుతుంది. అయితే, దాన్ని అధికారపార్టీ తట్టుకోలేకుంది. అందుకనే తమ సభ్యులు మాట్లాడేటప్పుడు మైక్ కట్ అవుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. అంటే అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ నుండి వెలగపూడికి మారినా సభలో పార్టీల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదని స్పష్టమైపోయింది.