
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఆయన పలువురు బీజేపీ నేతలతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఈరోజు ఉదయం మరోసారి మురళీధరన్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేవంలో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ కూడా పాల్గొన్నారు.
అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులు, భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం మురళీధరన్ నివాసం నుంచి బయటకు వెళ్తున్న పవన్ కల్యాణ్‌ను మీడియా ప్రతినిధులు పలకరించగా.. బీజేపీ పెద్దలను ఇంకా కలవాల్సి ఉందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలవనున్నట్టుగా చెప్పారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా భేటీ పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఏపీలో బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ తనకు రోడ్డు మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు తాను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీరుపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పీ రాజకీయ అంశాలతో పాటు, తెలంగాణకు సంబంధించిన పరిస్థితులపై కూడా బీజేపీ పెద్దలతో పవన్ కల్యాన్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడుల గురించి పవన్ ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జనసేనతో పాటు ఇతర విపక్షాల మీద అధికార వైసీపీ దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్.. ఇటీవల బీజేపీ నేత సత్యకుమారుపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను , సంఘాలను ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు శత్రువులుగా చూస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జాన్యాలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.