
హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం దాదాపు చేయి జారిపోయినట్లేనా? పరిస్ధితులను నిశితంగా గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపి ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు సచివాలయం బ్లాకులను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించే విషయమై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా నాలుగు బ్లాకులను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించేయాలని దాదాపు నిర్ణయం కూడా అయిపోయినట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ విషయమై ఒకవైపు తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోవైపు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కూడా నాలుగు బ్లాకులను అప్పగించేయాలని చంద్రబాబును కోరారు. దానికి తగ్గట్లే ఇటీవలే జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో నాలుగు బ్లాకులను ఇచ్చేయాలని నిర్ణయించిన సంగతి విధితమే.
అయితే, అప్పుడు జరిగింది కేవలం పార్టీ సమావేశం మాత్రమే. అందుకనే నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయించి దాదాపు ఆమోద్ర వేయించారు సిఎం. నాలుగు భవనాలను ఇచ్చేస్తున్నందుకు ప్రతిఫలంగా నాంపల్లిలోని మనోరంజన్ భవన్ అనే భవన సముదాయాన్ని ఏపికి కేటాయించనున్నట్లు తెలంగాణా ప్రభుత్వం నుండి ఇప్పటికే ప్రతిపాదన కూడా అందినట్లు సమాచారం. సదరు భవనానికి చెల్లించాల్సిన అద్దెను తెలంగాణా ప్రభుత్వమే కట్టేట్లుగా కెసిఆర్ ఒప్పుకున్నట్లు తెలిసింది.
మంత్రివర్గంలో జరిగిన చర్చలో నాలుగు బ్లాకులను తెలంగాణా ప్రభుత్వానికి ఇచ్చే విషయమై మిశ్రమ స్పందన వచ్చినట్లు సమాచారం. 10 ఏళ్ళ హక్కులను మనంతట మనమే వదులుకున్నట్లు అవుతుందని పలువురు మంత్రులు సందేహం వ్యక్తంచేయగా చంద్రబాబు సదరు సందేహాలను కొట్టేసినట్లు తెలిసింది.
తెలంగాణా ప్రభుత్వం ఏపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ స్ధలాన్ని చూపిన తర్వాత మాత్రమే మన ఆధీనంలో ఉన్న బ్లాకులను ఇస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో పదేళ్ల పాటు విభజన చట్టం ద్వరా ఏపికి సంక్రమించిన హక్కును ఏపి ప్రభుత్వమే తనంతట తాను వదులుకున్నట్లు అవుతోంది.