
కర్నూల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) నుండి తమిళనాడులోని కోయంబత్తూరుకు గుట్టుగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం (gold), వెండి (silver)తో పాటు భారీ నగదు (currency) ఏపీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువైన సొత్తును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ సొత్తుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేసారు.
హైదరాబాద్ నుండి కోయంబత్తూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ సొత్తును అక్రమంగా తరలిస్తున్నట్లు ఏపీ ఎస్ఈబీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కర్నూల్ పట్టణ శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద కాపుకాసారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అధికారులు అనుమానిస్తున్న ట్రావెల్స్ బస్సు చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఆపి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రయాణికుల వద్ద భారీగా నగదుతో పాటు బంగారం, వెండి పట్టుబడింది. బస్సు సీట్ల కింద డబ్బుల కట్టలతో కూడిన బ్యాగులు, ప్రత్యేకంగా తయారు చేయించిన బనియన్లలో కేజీల కొద్ది బంగారం, వెండిని పోలీసులు గుర్తించారు. ఈ సొత్తును స్వాధీనం చేసుకున్న అధికారులు పట్టుబడిన ఐదుగురిని కర్నూల్ పోలీసులకు అప్పగించారు.
పట్టుబడిన సొత్తుకు సంబంధించిన వివరాలను ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు. 8.250కిలోల బంగారు బిస్కెట్లు, 28.5కిలోల వెండితో పాటు రూ.90లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సొత్తుకు సంబంధించిన పత్రాలేవీ లేకపోవడంతో వీటిని తరలిస్తున్న దేవరాజు, మురుగేషన్, వెంకటేశ్, కుమారవేలు, సెల్వరాజులను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఈబి అధికారులు వెల్లడించారు.
ఇంత భారీమొత్తంలో డబ్బు. బంగారం, వెండి తరలింపు వెనక ఎవరున్నదీ దర్యాప్తులో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సొత్తుకు సంబంధించిన సరయిన పత్రాలుంటే తిరిగి అప్పగించడంతో పాటు అరెస్ట్ చేసిన ఐదుగురిని విడుదల చేయనున్నట్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే విదేశాల నుండి ఇలాగే లోదుస్తుల్లో దాచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. అతడు బంగారాన్ని అక్రమ తరలించడానికే లోదుస్తులకు ప్రత్యేకంగా జేబులు ఏర్పాటుచేసుకున్నాడు. వీటిలో 1144గ్రాముల బంగారాన్ని దాచి దుబాయ్ నుండి తీసుకువచ్చాడు.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో సదరు ప్రయాణికుడు అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు రూ.61.72లక్షల విలువైన బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.
ఇలా విదేశాల నుండి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. అయితే విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్మగ్లర్ల ఎత్తులను చిత్తుచేస్తున్నారు. ఇందుకు తాజా ఘటనే నిదర్శనం.