
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డ్రైనేజి విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. వైసీపీ కార్యకర్తలే తమపై దాడి చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. జిల్లాలోని ఆదోని పెద్దకడుబూర్లో అర్థరాత్రి మిరప పంట పొలంలో భాషా అనే రైతుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. భాషా నిద్రిస్తుండగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అతని వద్ద నుంచి రూ. 10 వేల నగదుతోపాటు మోటర్ బైకును ఎత్తుకుపోయారు. తీవ్రంగా గాయపడిన భాషను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై రైతు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.