
చంద్రబాబునాయుడు దుబారాకు బాగా అలవాటు పడిపోయారు. ఓ వైపు రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు తన ఇష్టారాజ్యంగా డబ్బును ఖర్చు చేయటం చంద్రబాబుకే చెల్లింది. అందులోనూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగటం ఓ వ్యసనంగా మారిపోయింది చంద్రబాబుకు. వెలగపూడిలోని సచివాలయం నుండి గన్నవరంకు వెళ్లాలన్నా చాలాసార్లు హెలికాప్టర్లోనే ప్రయాణిస్తున్నారు. అందుకోసం ఓ హెలిప్యాడ్ కూడా నిర్మించారు. తాజాగా కరకట్టలోని నివాసం వద్ద మరో హెలిప్యాడ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం వివాదాస్పదమవుతోంది.
సిఎం కాగానే హైదరాబాద్ సచివాలయంలోని హెచ్ సౌత్ బ్లాక్ లో కార్యాలయం ఏర్పాటుకు సుమారు రూ. 6 కోట్లు ఖర్చు చేసారు. వాస్తు ప్రకారం బాగాలేదని అందులో దిగేందుకు చంద్రబాబు నిరాకరించారు. సరే వెంటనే ఎల్ బ్లాక్ ను ఎంపిక చేసారు. సుమారు రూ. 22 కోట్ల వ్యయంతో వాస్తు ప్రకారమే మార్పలు చేసారు. అయితే, పట్టుమని అందులో ఏడాది కూడా లేరు. ఓటుకునోటు కేసు దెబ్బకు హైదరాబాద్ వదిలేసి విజయవాడకు పరుగెత్తారు. అక్కడ అక్రమ కట్టడమైన కరకట్టలోని లింగమనేని అతిధి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు.
దానికి రోడ్డని, ఇతర హంగులని సుమారు రూ. 25 కోట్లు వ్యయం చేసారు. అప్పటికే హైదరాబాద్లోని అతిధి గృహానికి, ఇంటికి, మళ్ళీ అద్దెకు దిగిన ఇంటికి, ఇంకోసారి ఫాంహౌస్ కు ఇలా ప్రభుత్వ ధనాన్ని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా విజజవాడలో కూడా ఇల్లని, క్యాంపు కార్యాలయం పేరుతో ఇరిగేషన్ కార్యాలయానికి, స్టేట్ గెస్ట్ హౌస్ కు కోట్లు వ్యయం చేసారు. తాజాగా కరకట్ట వద్ద హెలిప్యాడ్ నిర్మాణం కోసం రూ. 95 లక్షలు మంజూరైంది. ఇక్కడ విషయమేమిటంటే, కరకట్టకు వెలగపూడికి మధ్య దూరం సుమారు 6 కిలోమీటర్లు మాత్రమే. అంటే 6 కిలోమటర్లు ప్రయాణం చేయటానికి సిఎంకు మహా అయితే 5 నిముషాలు కూడా పట్టదు. ఈ ఐదు నిముషాల దూరానికి కూడా సిఎం హెలికాప్టర్ నే వాడదలిచారా అన్నది అర్ధం కావటం లేదు.