
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాలి తీసేసారు ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. ప్రత్యేకహోదా గురించి పవన్ స్టాండ్ ను తమ్మారెడ్డి తప్పుపట్టారు. హోదా విషయంలో అసలు పవన్ కు క్లారిటీ ఉందా అంటూ ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం, అవసరం లేదని రాష్ట్రం స్పష్టం చేసిన తర్వాత పవన్ కు అంతకన్నా క్లారిటీ ఇంకేం కావాలని నిలదీసారు. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని, అవసరం లేదని అంటున్న నరేంద్రమోడి, చంద్రబాబునాయుడును వదలేసి కేంద్ర, రాష్ట్రమంత్రులను తిట్టటంలో అర్ధం లేదన్నారు.
హోదాను ఇవ్వాల్సిన, సాధించాల్సిన వారిని వదిలేసి ఇతరులను తిట్టటం వల్ల ఏమిటి ఉపయోగమని పవన్ను ప్రశ్నించారు. హోదా విషయంలో ఇప్పటికి కేంద్రమంత్రులు కొన్ని వందల సార్లు చెప్పిన తర్వాత కూడా పవన్ ఇంకా క్లారిటీ గురించే మాట్లాడుతున్నారంటే తనకు ఆయనపైనే అనుమానాలు వస్తున్నాయన్నారు. జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో యువతతో పాటు పవన్ కూడా హోదా ఉద్యమంలో పాల్గొంటారని తాను అనుకున్నట్లు చెప్పారు. హోదాకు మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే ఉద్దేశ్యంతోనే తాను కూడా విశాఖపట్నంకు వెళ్లానన్నారు. కానీ అందరూ ఎదరు చూస్తున్నా పవన్ మాత్రం ఆరోజు ఎందుకు కనబడనేలేదని ప్రశ్నించారు.
ప్రత్యేకహోదా కోసం ఇక్కడ ఉద్యమాలు చేయకుండా అమెరికాలో మాట్లాడటంలో అర్ధం లేదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన క్లారిటీనే ఉందన్నారు. పవన్ కూడా హోదా విషయంలో ఒక స్టాండ్ తీసుకోవాలని సూచించారు. హోదా కావాలంటే పోరాటాలు చేయాలని, అక్కర్లేదనుకుంటే ఆ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. ఏం చేయాలో పవనే నిర్ణయించుకోవాలన్నారు. అయితే, ఉద్యమాలు చేస్తే తప్ప హోదా రాదని తాను కూడా నమ్ముతున్నట్లు తమ్మారెడ్డి స్పష్టం చేసారు.