
వైసీపీ ఎంఎల్ఏ రోజా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసు సంఘాన్ని ప్రభుత్వం రంగంలోకి దింపినట్లే ఉంది. మహిళా పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రోజాను పోలీసులు గన్నవరం విమానాశ్రయంలోనే అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. సదస్సులో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం ఉందని రోజా చెప్పినా పోలీసులు వినింపిచుకోలేదు. దాంతో విజయవాడలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇదే విషయమై డిజిపి సాంబశివరావును కలిసి ఫిర్యాదు కూడా చేసారు. అయితే, సదస్సును భగ్నం చేసేందుకే రోజా వస్తున్నట్లు తమకు సమాచారం ఉందని డిజిపి విచిత్రమైన సమాధానం చెప్పారు.
అప్పటినుండి రోజు ఇటు చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాదరావుతో పాటు డిజిపిని ఓ రేంజిలో దుమ్మెత్తిపోస్తోంది. రోజాకు మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. దాంతో ప్రభుత్వ డిఫెన్స్ లో పడిపోయింది. డిజిపిని ఉద్దేశించి రోజా మాట్లాడుతూ, ‘పోలీసు బాసువా లేక చంద్రబాబు బానీసవా’ అంటూ విరుచుకూపడ్డారు. ఈ మధ్యలో రోజాకు ధీటుగా మహిళా మంత్రులు కౌంటర్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దానికితోడు మహిళగా, ఓ ఎంఎల్ఏగా పోలీసులు తన హక్కులకు భంగం కలిగించారంటూ గన్నవరం కోర్టులో డిజిపి తో పాటు మరో ఐదుగురు అధికారులను బాధ్యులను చేస్తూ కేసు దాఖలు చేసారు.
ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. రేపటి రోజున కోర్టు విచారణలో ఏం సమాధానం చెప్పాలో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు. ఇటు రోజా ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక అటు కోర్టుకు ఏం చెప్పాలో అర్ధంకాక ప్రభుత్వం తల పట్టుకుంది. ఈ నేపధ్యంలోనే హటాత్తుగా పోలీసు అధాకారుల సంఘం నేతలు రంగంలోకి దిగారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, రోజా వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు చెప్పారు. తాము ఎవరికీ బానిసలం కాదని కేవలం ప్రజలకు మాత్రమే బానిసలమంటూ అధ్యక్షుడు సమాధానం చెప్పటం గమనార్హం.