
భీమవరం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో వుండగా బెయిల్ రావాలని... పార్టీ పెట్టాక ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ తెలిపాడు. వైసిపి పార్టీ కోసం కుటుంబాన్ని, వ్యాపారాలను వదిలిపెట్టి పనిచేసానని తెలిపాడు. కానీ ఇప్పుడు జగన్ పాలన చూస్తుంటే తాను ఎంతపెద్ద తప్పు చేసానో అర్థమవుతోందంటూ సదరు సర్పంచ్ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల గ్రామ సర్పంచ్ పీతల బుచ్చిబాబు బీమవరంలో బిజెపి, జనసేన ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్ళించిందంటూ చేపట్టిన ఈ ఆందోళనల్లో బుచ్చిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో తాను వైసిపి కోసం పనిచేసానని... ఆ తప్పుకు ఇదే పరిహారం అందరిముందే కాలి చెప్పు తీసి కొట్టుకున్నాడు.
ప్రస్తుతం తాడేపల్లిగూడెం మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడిగా బుచ్చిబాబు కొనసాగుతున్నారు. గతంలో ఇతడు వైసిపి పార్టీ నాయకుడిగా పనిచేసాడు. కానీ తనకు పార్టీలో సముచిత స్థానం దక్కడంలేదంటూ బయటకు వచ్చి ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి ల మద్దతుతో ఆరుగొల సర్పంచ్ గా పోటీచేసి గెలుపొందాడు. ఆ తర్వాత అతడు మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడిగా మారాడు.
Read More 'పేదలకు జగనన్న షాక్... ఈ పూరి గుడిసెకు వేలల్లో కరెంట్ బిల్లా..!' (వీడియో)
తాజాగా భీమవరం ఆందోళన కార్యక్రమంలో బుచ్చిబాబు గతంలో వైసిపి కోసం ఎంతలా కష్టపడ్డాడో వివరించాడు. జగన్ ను ఎంతో అభిమానించేవాడినని... అతడు జైల్లో వుంటే బెయిల్ వచ్చేలా చూడాలని మేరీమాతను మొక్కుకున్నట్లు తెలిపాడు. బెయిల్ వచ్చాక ఆ మొక్కును కూడా తీర్చుకున్నానని అన్నాడు. వైసిపి బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేసానని... జగన్ పేరుతోనే ప్రతిదీ చేసేవాడినని అన్నాడు. కానీ అలా ఎందుకు చేసానా అని ఇప్పుడు బాధపడుతున్నానంటూ బుచ్చిబాబు అందరిముందే చెప్పుతో కొట్టుకున్నాడు.
వైసిపి కోసం పనిచేసి చాలాపెద్ద తప్పు చేసానని... దేవుడు ఎలాగూ క్షమించడు, ప్రజలయినా తనను క్షమించాలని బుచ్చిబాబు కోరాడు. ప్రజల కోసం వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని... ప్రజల తమతో కలిసి రావాలని బుచ్చిబాబు కోరాడు.