అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తాను చంద్రబాబు దత్త పుత్రుడైతే మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడా అనాలా అని ప్రశ్నించారు.
అనంతపురం:తాను Chandrababu దత్తపుత్రుడైతే మిమ్మల్ని CBI దత్త పుత్రుడు అనాల్సి వస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను చంద్రబాబు దత్త పుత్రుడు అంటున్నారని YCP నేతల విమర్శలపై పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు. గత వారంలో జరిగిన రెండు సభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంగళవారం నాడు అనంతపురం జిల్లాలో కౌలు రైతులకు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆఈయన మీడియాతో మాట్లాడారు. తాను విధానపరమైన అంశాలపై వ్యాఖ్యానిస్తానని జనసేన చీఫ్ Pawan Kalyan చెప్పారు. కానీ, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ మాత్రం ఊరుకోబోనని ఆయన తేల్చి చెప్పారు. తనకు నీతులు చెప్పే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు.
జనసేన టీడీపీకి బీ టీం అయితే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటామన్నారు. ఆర్ధిక నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని ఆయన జగన్ పై మండిపడ్డారు. దేశం కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు.16 నెలలు జైల్లో కూర్చొని వచ్చి మీరా మాకు నీతులు చెప్పేది అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పరామర్శకు వస్తున్నానని తెలియగానే ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ. 7 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక మాదిరిగా తయారౌతుందని చంద్రబాబు ఇటీవల విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఊతమిచ్చేలా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని జగన్ విమర్శలు చేశారు. ఎల్లో మీడియాతో పాటు దత్త పుత్రుడు కూడా ఇదే పల్లవిని అందుకున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక దుష్ఫ్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడు అంటూ జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందించారు.
గతంలో కూడా వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం సాగింది.. పవన్ కళ్యాణ్ పై గతంలో కూడా సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు.ఈ విమర్శలపై కూడా పవన్ కళ్యాణ్ జగన్ కు కౌంటరిచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై విపక్షాలు చేసిన విమర్శలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు విపక్షాల మధ్య ఐక్యత కోసం ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శలను మరింత పెంచింది. టీడీపీని అధికారంలోకి తీసుకు రావడం పవన్ కళ్యాణ్ విపక్షాల మధ్య ఓటు బ్యాంకు చీలకుండా ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది.