చంద్రబాబుకు ఎవర్ని ఎలా లాక్కోవాలో తెలుసు.. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకే ఈ ఆరోపణలు.. సజ్జల

By SumaBala BukkaFirst Published Feb 1, 2023, 2:14 PM IST
Highlights

నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణల మీద సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీలోకి వెళ్లడానికి నిర్ణయించుకునే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టైపింగ్ విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఉదయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ టాపిక్ గురైందని, తన దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయని.. దీంతో మనస్థాపం చెందానని ప్రకటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు  మండిపడుతున్నారు. 

ఆయన చేసిన వ్యాఖ్యలపై  వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. కోటంరెడ్డి త్వరలోనే టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని.. అందుకే వైసిపిపై ఈ స్థాయిలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా తన ఉద్దేశాలు చెప్పారు..  దీని తర్వాత కూడా తీసుకోవలసిన చర్యలు ఏముంటాయని అన్నారు. ఎమ్మెల్యేల ఫోన్లు టైపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్ టాపింగ్లను నమ్ముకుని రాష్ట్రాన్ని పాలించడం లేదని..  రాష్ట్ర ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని అన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేసిన అనుమానాలు ఉంటే.. ఎవరైనా, ఎవరికైనా ఈ విషయంలో ఫిర్యాదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పదవి రాలేదని అసంతృప్తి ఉండడం సహజమని, అది వేరని.. బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంపై, ఓ నాయకుడి పై, ముఖ్యమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు అని అన్నారు. 

ఆ ఆడియోను ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు పంపారు.. జగనన్న నీ ఫోన్ ట్యాప్ చేస్తే..?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఇంకా ఎవరిని  నియోజక వర్గ ఇన్చార్జిగా నియమించలేదని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబుకు మనుషుల్ని ఎలా లాక్కోవాలో తెలుసని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అంతకుముందు దీని మీద మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నది ఫోన్ టాపింగ్ అయి ఉండకపోవచ్చు అని.. అది కాల్ రికార్డు కావచ్చు అని అన్నారు.

ఇదిలా ఉండగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజా సమస్యలపై తాను ప్రశ్నిస్తే తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బుధవారం ఉదయం మీడియా సమావేశంలో ఆరోపించారు.  అందుకే తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. నాలుగు నెలల ముందే తన ఫోన్ టాపింగ్ అవుతున్నట్లుగా ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారని.. కానీ ఆ విషయాన్ని తాను నమ్మలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మీద కోపంతో అతను అబద్ధం చెప్పి ఉంటాడని అనుకున్నాను అన్నారు. అయితే, 20 రోజుల క్రితం తన ఫోన్ టాపింగ్ గురవుతుందన్న దానిపై తనకు ఆధారం దొరికిందని చెప్పారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా తన ఫోన్ టాపింగ్ జరగదని అన్నారు. దశాబ్దాలుగా తను పార్టీకి విధేయుడుగా ఉన్నానని తన మీద ఆరోపణలు చేయడం భావ్యమేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడు విధేయుడుగానే ఉన్నానని జగన్ మీద కానీ, వైసీపీ మీద కానీ ఎప్పుడు పరుషంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తనకు అవమానం జరిగే చోట ఉండలేనని అన్నారు. విధేయుడైన తనమీద పార్టీ నాయకుడికి నమ్మకం ఉండకపోతే తాను పార్టీలో ఉండడంలో అర్థంలేని విషయం అన్నారు.

click me!