రోడ్లు మీటింగ్‌ల కోసం కాదు.. నిబంధనలు ఉల్లంఘిస్తామమంటే చట్టం చూస్తూ ఊరుకోదు: సజ్జల

Published : Jan 03, 2023, 12:54 PM IST
రోడ్లు మీటింగ్‌ల కోసం కాదు.. నిబంధనలు ఉల్లంఘిస్తామమంటే చట్టం చూస్తూ ఊరుకోదు: సజ్జల

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని  రోడ్లపై సభలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. జీవోలోని నిబంధనలు కొత్తేమీ కాదని.. గతంలో ఉన్నవేనని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని  రోడ్లపై సభలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. జీవోలోని నిబంధనలు కొత్తేమీ కాదని.. గతంలో ఉన్నవేనని చెప్పారు. సజ్జల ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. రోడ్ల మీద సభలు, ర్యాలీలు పెట్టడం బాగా జరిగినంత వరకు ఏమి ఉండదని.. కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ప్రజల భద్రత గురించి ఆలోచన  చేయడం జరిగిందన్నారు. రోడ్లు మీటింగ్‌ల కోసం ఏర్పాటు చేసినవి కావని అన్నారు. సభలు జరిపేందుకు ప్రత్యామ్నాయాలు సూచించి.. రోడ్లను ప్రజల అవసరాల కోసం మాత్రమే వినియోగించుకునే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

జీవోలోని  నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకే కాదు.. వైసీపీకి కూడా వర్తిస్తాయని అన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు అసలే నిర్వహించకూడదని అనలేదని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్‌లలో నిర్వహించుకోవచ్చని తెలిపారు. వైసీపీ కూడా పోలీసులు, అధికారులు అనుమతి తీసుకుని సభలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను చీకటి జీవో అనడంలో అర్థం లేదన్నారు. 

అలా కాదని నిబంధనలు  ఉల్లంఘిస్తామమంటే చట్టం చూస్తూ ఊరుకోదని అన్నారు. బరితెగించి నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు తగిన పరిణామాలు కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. రాజకీయంగా కుట్రలు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. 

ఇక, ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రోడ్లపై సభలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్టుగా తెలిపింది. ప్రజలకు ఇబ్బందులు  లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రాజ్ రహదారులను ప్రజలు, సరుకుల రవాణాకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. రోడ్లకు దూరంగా, జనాలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాల్లో సభలకు స్థలాలు ఎంపిక చేయాలని.. పార్టీలు, సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని తెలిపింది.

అయితే అత్యంత అరుదైన సమయాల్లో ఎస్పీలు లేదా సీపీలు కచ్చితమైన షరతులతో అనుమతులు ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు ముందుగా నిర్వాహకులు లిఖితపూర్వకంగా అనుమతి  తీసుకోవాలని పేర్కొంది. సభను ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు అనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే రూట్‌ మ్యాప్, సభకు వచ్చే జనాల సంఖ్య, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను కూడా నిర్వాహకులు వివరించాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu