Rajiv Gandhi Death Anniversary : ఆనాడు రాజీవ్ గాంధీ వైజాగ్ లో ఉండుంటే బ్రతికేవారే..!

Published : May 21, 2025, 02:13 PM ISTUpdated : May 21, 2025, 02:55 PM IST
Rajiv Gandhis

సారాంశం

నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ అభిమాన నాయకుడు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాందీ వర్ధంతిని   జరుపుకుంటున్నారు. అయితే ఆయన చివరి పర్యటన ఆంధ్ర ప్రదేశ్ లోనే సాగింది.. రాత్రికి వైజాగ్ లోనే బస చేయాల్సింది. మరి శ్రీపెరంబదూరు ఎలా వెళ్లారంటే.. 

Rajeev Gandhi : 34 ఏళ్ళ కిందట సరిగ్గా ఇదేరోజు (మే 21, 1991) లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో ఎన్నికల ప్రచార సభలో ఆయనపై ఎల్టిటిఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఓ యువతి పూలమాల వేసేందుకని రాజీవ్ వద్దకువెళ్లి తనను తాను పేల్చేసుకుంది... ఇందులో దివంగత ప్రధాని కూడా ప్రాణాలు కోల్పోయారు.

అయితే రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఆంధ్ర ప్రదేశ్ లోనే సాగింది. ఉత్తరాంధ్రలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన వైజాగ్ నుండే శ్రీపెరంబదూరుకు బయలుదేరారు. అయితే ఆయన పెరంబుదూరు ప్రయాణం క్యాన్సిల్ అయి వైజాగ్ లోనే బస చేయాల్సిందట... కానీ చివరి నిమిషంలో ప్రయాణం కొనసాగిందట. వైజాగ్ లోనే ఉండివుంటే ఆయన బ్రతికేవారే.

ఇలా రాజీవ్ గాంధీ హత్యకు ముందు జరిగిన పరిణామాలను నేడు (మే 22) ఆయన వర్దంతి సందర్భంగా డా. జి. లీలావర ప్రసాద రావు గుర్తుచేసారు. ఈయన రాసిక కథనం యధావిధిగా అందిస్తున్నాం.

రాజీవ్ గాంధీ 'చివరి ప్రయాణం' ఉత్తరాంధ్రలోనే! ( నేడు తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మరియు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా...)

దేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ 'చివరి ప్రయాణం' మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే సాగింది. సరిగ్గా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం, అప్పుడు జరుగుతున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఒడిస్సా రాష్ట్ర పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తొలుత పాలకొండ(రాజీవ్ అంతర్గత భద్రత సిబ్బందిలో పాలకొండవాసి ఒకరు ఉండేవారు) జూనియర్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల భారీ బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి డాక్టర్ కణితి విశ్వనాథం కు మద్దతుగా పాల్గొన్నారు.

తర్వాత విజయనగరం చేరుకున్నారు. రాజీవ్ రాక కోసం విజయనగరం ప్రజలు ఆ రోజు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. రాజీవ్ రాకతో వారంతా ఆనందంతో పొంగిపోయారు. ఈ సందర్భంగా రాజీవ్ కు ఘనస్వాగతం లభించింది. బొబ్బిలి స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసిన ఆనంద గజపతి రాజును గెలిపించేందుకు విజయనగరం ఫుట్ బాల్ గ్రౌండ్‌లో ఎన్నికల ప్రచారసభ లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశాఖ చేరుకొని సాగర తీరంలో స్థానిక పార్టీ అభ్యర్థి ఉమా గజపతిరాజు కు మద్దతుగా ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్నారు. వైజాగ్ లోని స్థానిక సర్క్యూట్ హౌస్ లో కాసేపు సేద తీరారు. అక్కడ తనను కలిసిన విశాఖ కాంగ్రెస్ పార్టీనాయకుల్ని, కార్యకర్తలని కలుసుకొని సరదాగా ముచ్చటించారు.

ఆఖరి నిమిషంలో విమానం రెడీ! విశాఖలో ఆగిపోయి ఉంటే..?

తమిళనాడులోని ఎన్నికల ప్రచారం కోసం సాయంత్రం ఏడున్నరకు విశాఖ నుంచి బయలుదేరి వైజాగ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ విమానం బయలుదేరే సమయంలో కమ్యూనికేషన్ సిస్టం పనిచెయ్యడం లేదని పైలెట్లలో ఒకరైన కెప్టెన్ చందోక్ గమనించారు. ఈ విషయం రాజీవ్ గాంధీతో చెప్పగానే స్వయంగా పైలెట్ అయిన రాజీవ్ గాంధీ ఆయనతో కలిసి ఆ సమస్యను సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దానితో ఆ రాత్రికి వైజాగ్ లోనే ఉండిపోవడానికి సిద్ధమైన రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయారు.

రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ కి వెళ్లిపోగానే విమానం ఇంజినీర్ విమానాన్ని మరోసారి పరీక్షించి అందులోని లోపాన్ని సరిచేశారు. దీంతో విమానం రెడీ అయిపోయింది అనే వార్త విని వెంటనే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కి తిరిగి వచ్చారు. అయితే వేరే కారులో వచ్చిన ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ సాగర్ మాత్రం విమానాన్ని అందుకోలేకపోయారు. రాజీవ్ గాంధీతో పాటు ఆయన మీడియా సలహదారు సుమన్ దూబే, బల్గెరియా నుంచి వచ్చిన ఇద్దరు జర్నలిస్టులు, పైలట్స్ ఆ విమానంలో ఉన్నారు. సాయంత్రం 6:30 కి విశాఖలో విమానం బయలుదేరింది.

తన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్ కు రాత్రి 10 గంటలకు రాజీవ్ చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన మానవ బాంబు దాడిలో దారుణ హత్యకు గురయ్యారనే వార్త దేశ ప్రజలతోపాటు ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని శోక దుఃఖములోకి నెట్టేసింది. రాజీవ్ చివర రాజకీయ మజిలీ ఉత్తరాంధ్రయే కావడం చరిత్రలో నేడొక జ్ఞాపకంగా మిగిలిపోయింది...రాజీవ్ గాంధీ వైజాగ్ లో చివరిసారిగా ప్రసంగించిన ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఆయన విగ్రహంతో పాటు రాజీవ్ స్మృతి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ విషాదాన్ని, నాటి పర్యటనను అది గుర్తుచేస్తూనే ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YSRCP Ambati Rambabu House Attack అంబటి ఇంటి పై దాడి చేసిన దృశ్యాలు ఇవే| Asianet News Telugu
AP Politics : ఆంధ్ర ప్రదేశ్ అసలేం జరుగుతోంది..? వైసిపి చేసిన తప్పే టిడిపి చేస్తోందా..?