కడపలోని ప్రొద్దటూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి వరదరాజులు రెడ్డి పోటీ చేశారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో కాసేపట్లో క్లారిటీ రానుంది.
సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ప్రొద్దుటూరు. వాణిజ్యానికి, బంగారం వ్యాపారానికి ఈ పట్టణం కేంద్రం. అక్కడక్కడా ఫ్యాక్షన్ జాడలు కనిపించినా.. మిగిలిన రోజుల్లో ప్రశాంతంగానే వుంటుంది ప్రొద్దుటూరు. డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో కళంకారి ఫ్యాబ్రిక్స్ తయారవుతుంది. రాజకీయంగానూ ప్రొద్దుటూరు కీలక ప్రాంతం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాలున్నాయి.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,730 మంది. రెడ్డి, బలిజ, ఆర్యవైశ్య, పద్మశాలి, ముస్లిం మైనారిటీలు ఇక్కడ బలంగా వున్నారు. ప్రొద్దుటూరు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ ఆరు సార్లు , టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. అయితే స్వతంత్ర అభ్యర్ధులు ఐదు సార్లు ప్రొద్దుటూరు నుంచి గెలుపొందడం విశేషం.
సీనియర్ నేత నంద్యాల వరదరాజులు రెడ్డి కాంగ్రెస్, టీడీపీల నుంచి వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు. 1985లో ఎంట్రీ ఇచ్చిన వరదరాజులు రెడ్డి 2004 వరకు అప్రతిహత విజయాలు సాధించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 1,07,941 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి మల్లెల లింగారెడ్డికి 64,793 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 45,148 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రొద్దుటూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024..
వరుసగా రెండు సార్లు గెలిచిన వైసీపీ మరోసారి ప్రొద్దుటూరులో జెండా ఎగురవేయాలని భావిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి పోటీచేశారు. తెలుగుదేశం చివరిసారిగా 2009లో ప్రొద్దుటూరు నుంచి గెలిచింది. బీజేపీ, జనసేన మద్ధతుతో ఈసారి ఇక్కడ పాగా వేయాలని తెలుగుదేశం భావించింది. అందులో భాగంగా వరదరాజులు రెడ్డిని బరిలోకి దించింది. మరి ఈ సారి వైసీపీని టీడీపీ కొడుతుందా, విజయం ఎవరిది అనేది కాసేపట్లో తేలనుంది.