
పాపం పెద్దయానకు ఎంత కష్టమొచ్చిందో. ఇంతకీ పెద్దాయన ఎవరంటారా ? ఆయనే రాష్ట్ర అధికార యంత్రాంగంలో ప్రప్రధముడు. అత్యున్నత స్ధానంలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్. ఇప్పటికే ఉద్యోగ బాధ్యతలనుండి విరమణ చేసారు. అయితే, సర్వీసు పొడిగింపులో ఉన్నారు. రెండోసారి పొడిగింపు కూడా వచ్చే ఫిబ్రవరి నెలతో అయిపోతుంది.
ఇంతకూ ఆయనకు వచ్చిన కష్టమేమిటంటే కొందరు ఐఏఎస్ అధికారులు ఆయన మాటకు ఏమాత్రం విలువ ఇవ్వటం లేదట. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు. ఎందుకు వింటారు? పై కలెక్టర్లతో ప్రతీరోజు చంద్రబాబు నాయుడు గంటల తరబడి నేరుగా మాట్లాడుతుంటే ఇంక వారు ఎవరినైనా ఎందుకు లెక్కచేస్తారు.
అధికార వర్గాలు చెబుతున్నదాని ప్రకారం రాష్ట్రంలోని పలువురు టిడిపి ప్రజాప్రతినిధులు, నేతలు అనేక పనుల కోసం జిల్లాల కలెక్టర్లను కలుస్తుంటారు. అయితే వారిలో అత్యధికులకు కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారుల దర్శనం కావటం లేదు. దాంతో వారందరూ ఠక్కర్ ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
సమస్యలను విన్నతర్వాత వారిచ్చిన వినతిపత్రాలను ఠక్కర్ సంబంధిత ఐఏఎస్ అధికారులకు పంపుతున్నారు. అయితే, ఇక్కడే అసలు సమస్య వస్తోందట. ప్రజాప్రతినిధులు, నేతలను లెక్కచేయని కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శినీ లెక్క చేయటం లేదట.
మాట చెల్లుబాటు కావటం లేదనే మనస్తాపానికి గురైన సిఎస్ సీట్లో కూర్చుని ఉపయోగం లేదని అనుకున్నారట.
అంతేకాకుండా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ విషయాల్లో కూడా ఆయన మాట చెల్లుబాటు కావటం లేదని సమాచరం. అసలే ముక్కుసూటి మనిషిగా ఠక్కర్ కు పేరుంది. దాంతో తన మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదన్న బాధతోనే శెలవులో వెళ్లిపోయారని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాకపోతే దానికి అనారోగ్యం అనే ముసుగు వేసారట.