ముద్రగడకు మద్దతుపై స్పష్టత వచ్చినట్లే

First Published Dec 23, 2016, 8:27 AM IST
Highlights

ముద్రగడకు బహిరంగంగా మద్దతు పలకకపోతే వైసీపీ నష్టపోతుందనే ఆందోళన జగన్ లో మొదలైనట్లు సమాచారం

కాపు ఉద్యమంలో ముద్రగడను వెనకుండి నడిపిస్తోందెవరనే విషయంలో మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరైన భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం ముద్రగడతో భేటీ తర్వాత చేసిన ప్రకటన తో పై విషయం స్పష్టమైంది.

 

ముద్రగడ నివాసంలో ఆయనతో భేటీ తర్వాత భూమన మీడియాతో మాట్లాడుతూ, కాపు ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కాపు ఉద్యమంలో కార్యకర్తగా పనిచేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

 

గతంలో ముద్రగడ ఉద్యమానికి మద్దతు తెలపటానికి వెళ్ళిన తనపై చంద్రబాబు ప్రభుత్వం అరాచక వాధిగా, సంఘ విద్రోహ శక్తిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించిందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనను రెచ్చగొడితే కాపు ఉద్యమంలో పాల్గొని ఎంతటి త్యాగం చేయటానికైనా సిద్ధమన్నారు.

 

భూమన మాటలతో ఓ విషయంలో క్లారిటి వచ్చింది. ఇంతకాలం ముద్రగడను వెనకుండి నడిపిస్తోంది వైసీపీనే అన్న విషయం. ఎందుకంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా భూమన ముద్రగడ ఇంటికి వెళ్లరు. వెళ్ళినా ముద్రగడతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మద్దతు పలికే అవకాశం లేదు.

 

ముద్రగడ చేపట్టిన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా పార్టీలోని కాపు నేతలను ముద్రగడపైకి ఉసిగొల్పుతున్నారు చంద్రబాబు. ఇటువంటి పరిస్ధితుల్లో కాపుల్లో కొంత గందరగోళం మొదలైంది.

 

ఇపుడు గనుక ముద్రగడకు బహిరంగంగా మద్దతు పలకకపోతే వైసీపీ నష్టపోతుందనే ఆందోళన జగన్ లో మొదలైనట్లు సమాచారం. అందులో భాగంగానే ముద్రగడ-భూమన భేటీ, బహిరంగంగా మద్దతు ప్రకటన చేయించినట్లు సమాచారం.

click me!