Prashant Kishor: చంద్రబాబుతో భేటీ అనంతరం ప్రశాంత్ కిశోర్ స్పందనేంటీ? 

By Rajesh Karampoori  |  First Published Dec 23, 2023, 10:47 PM IST

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడం... చంద్రబాబుతో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమే.ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తారా? లేక సలహాలు ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. 


Prashant Kishor: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి వ్యూహ్యకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరారు.

అనంతరం వీరిద్దరూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి భేటీ సూమారు గంటన్నర పాటు జరిగింది.ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.

Latest Videos

ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణమేమి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని తెలిపారు. తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని వెల్లడించారు. 

గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఐ ప్యాక్ సంస్థ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి పనిచేశారు. అనంతరం జరిగిన పరిణామాల తరువాత ప్రశాంత్ కిషోర్.. ఐప్యాక్ నుంచి నిష్క్రమించారు. బీహార్‌లో సొంతంగా రాజకీయ కార్యచరణకు పూనుకున్నారు. ఏదిఏమైనా ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామమేనని చెప్పాలి. 

ఇదిలా ఉంటే.. చంద్రబాబు-ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం ఐప్యాక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి తమ సేవలు కొనసాగుతాయని ప్రకటించింది.
 

click me!