ప్రశాంత్ కిషోర్ ఏపీలో అడుగుపెట్టడం రాజకీయంగా సంచలనమైంది. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు నాయుడు భేటీ కావడం అనేక ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు శిష్యులు రాబిన్ శర్మ, రిషి రాజ్‌లు టీడీపీ, వైసీపీలకు వ్యూహకర్తలుగా పని చేస్తున్నారు.
Prashant Kishor: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కాక ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది. ఎన్నికల రాజకీయం ఫుల్ స్వింగ్‌లోకి వస్తున్నది. వైసీపీ అభ్యర్థుల మార్పులు, చేర్పుల్లో ఉండగా.. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నాయి. వైసీపీ, టీడీపీ ఉభయ పార్టీలకూ ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలో ఉన్న శిష్యులకు గురువైన ప్రశాంత్ కిషోర్‌ను రప్పించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి సేవలు అందించాడు. సర్వేలు, వ్యూహాలు అందించి ఘన విజయాన్ని సమకూర్చి పెట్టాడు. వైసీపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికల్లోనూ ఏపీలో దుమ్మురేపింది. టీడీపీ దాదాపుగా కునారిల్లిపోయింది. జనసేన ఒక్క ఎమ్మెల్యే తప్పితే పత్తా లేకుండా పోయింది.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో వ్యూహకర్తగా పని చేయడం లేదు. బెంగాల్‌లో ఆయన పని చేసిన టీఎంసీ పార్టీ గెలుపొందిన తర్వాత బిహార్‌లో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ఆయన స్థాపించిన కంపెనీ ఐప్యాక్ మాత్రం పార్టీలకు సేవలు అందిస్తున్నది. ఇప్పుడు ఏపీలోనూ ఐప్యాక్‌కు చెందిన రిషి రాజ్ అధికార వైసీపీకి సేవలు అందిస్తున్నాడు. అలాగే, ప్రతిపక్షంలోని టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నాడు. వీరిద్దరూ ప్రశాంత్ కిషోర్‌కు శిష్యులే.
Also Read: Mallikarjun Kharge: విపక్ష కూటమికి మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థి అయితే..!?
ప్రశాంత్ కిషోర్ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. తాను వైసీపీని గెలిపించడానికి సహకరించినందున విమర్శలు ఎదుర్కొంటున్నానని కామెంట్ చేశారు. ఈ తరుణంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈ రోజు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాబిన్ శర్మ టీం కూడా పాల్గొంది. నిజానికి 2019లో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ సేవలు అందిస్తుండగా చంద్రబాబు నాయుడు ఈయనపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను రప్పించుకోవడం గమనార్హం. ఇది వరకే ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఇద్దరు శిష్యులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు వ్యూహాలను అందిస్తున్నారు. ఇప్పుడు గురువు కూడా ఏపీ పాలిటిక్స్‌లో అడుగుపెట్టాడా? అని చర్చించుకుంటున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల గడువు ఉన్నది. వ్యూహకర్తలు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ, ప్రశాంత్ కిషోర్‌కు ఉన్న ట్రాక్ రికార్డు కారణంగా ఆయన లేటుగా వచ్చినా.. రిజల్ట్ చూపించే వెళ్లుతాడని కొందరు భావిస్తున్నారు. పోటా పోటీగా ఉన్న సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సేవలు అందించకున్నా.. రెండు మూడు సార్లు కలిసి, ఏవో స్ట్రాటజీలు అందించినట్టు లీకులు ఇచ్చినా.. ప్రజల్లో ఓ పర్సెప్షన్ ఏర్పడే అవకాశం ఉన్నది.
ఈ స్వల్ప సమయంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తారా ? లేక సలహాలు, సూచనలకే పరిమితం అవుతారా? అనేది కూడా ఇంకా తేలలేదు.
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సిఫారసుతో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడును కలవడానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.