
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే సడెన్‌గా టీడీపీ వైపు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై వైసీపీ నుంచి అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడని, చనిపోయిన టీడీపీకి పోస్ట్‌మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడని దుయ్యబట్టారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా.. ఎంతమంది పవన్ కళ్యాణ్‌లు కట్టకట్టుకుని వచ్చినా , ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.
ALso Read: Prashant Kishor: ఏపీలో ఎన్నికల రాజకీయం.. టీడీపీ, వైసీపీలను గురు శిష్యులు పంచుకున్నారా?
ప్రశాంత్ కిషోర్ గతంలో ఎన్నో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారని, గతంలో వైసీపీకి కూడా వ్యవహరించారని చెప్పారు. ఈరోజు లోకేష్‌ని కలిశారని.. గతంలో ప్రశాంత్ కిషోర్‌పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుతెచ్చుకోవాలని అంబటి చురకలంటించారు. పీకేని గతంలో చంద్రబాబు డెకాయిట్ అని వ్యాఖ్యానించారని.. రాజకీయ స్వార్ధం కోసం చంద్రబాబు, లోకేష్ దిగజారుతారని ఎద్దేవా చేశారు.
ఈ పీకే వచ్చినా, ఈ పీకే వచ్చినా టీడీపీ బ్రతకడం అసాధ్యమని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మెటీరియల్ బాలేకపోతే మేస్త్రి వచ్చినా ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించారు. టీడీపీ మెటీరియల్ సరిగా లేదని, తెలుగుదేశం కార్యకర్తలు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని రాంబాబు సూచించారు. గతంలో వున్న రాబిన్ శర్మ పని అయిపోయిందా .. అందుకే కొత్త వ్యూహ కర్తను తెచ్చుకున్నారా అని ఆయన నిలదీశారు.