
పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిని నిరూపించేందుకు విజయవాడకు వచ్చిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం విచిత్రంగా ఉంది. ఈరోజు ఉదయం విజయవాడలోని ప్రకాశంబ్యారేజి వద్దకు చేరుకున్న ఉండవల్లిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా రాజమండ్రి టిడిపి ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి-ఉండవల్లి మధ్య పట్టిసీమ, పోలవరం పథకాలపై పెద్ద ఎత్తున వాదన జరుగుతున్న విషయం తెలిసిందే కదా?
ఎత్తిపోతల పథకంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందన్న ఉండవల్లి ఆరోపణలపై బుచ్చయ్య స్పందించారు. ప్రాజెక్టుల వల్ల ఉపయోగం, జరిగిన అవినీతి తదితరాలపై ఇద్దరి మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు కూడా జరిగాయి. ప్రాజెక్టులపై ఈరోజు విజయవాడలో బహిరంగ చర్చకు రావాలని బుచ్చయ్య సవాలను ఉండవల్లి సానుకూలంగా స్పందించటంతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. అయితే, చర్చంటూ జరిగితే ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడుతుందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే, పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరలే (కాగ్) వ్యాఖ్యానించిన సంగతి గమనార్హం.
ఇటువంటి నేపధ్యంలో అదే ప్రాజెక్టుపై బహిరంగ చర్చ అంటే ప్రభుత్వం తన నెత్తిన తానే చెత్త నెత్తినేసుకోవటమే. అందుకే ప్రభుత్వం చర్చను పరోక్షంగా అడ్డుకుంది. ఈరోజు ఉదయం దుర్ఘాఘాట్ వద్దకు ఒంటరిగా చేరుకున్న ఉండవల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గన్నవరంకు చేరుకున్న బుచ్చయ్యను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దుర్ఘాఘాట్ వద్ద సెక్షన్ 30 అమల్లో ఉన్న కారణంగా ఎవరినీ ఇక్కడకు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టంగా చెప్పి పంపేసారు. దాంతో బహిరంగ చర్చకు అంతరాయం ఏర్పడింది. మళ్ళీ ఇంకో వేదికను ఏర్పాటు చేసుకుంటారా? లేక అవకాశం దొరికింది కదా అని చర్చే లేకుండా చేస్తారా అన్నది చూడాలి.