మామిళ్లపల్లి పేలుడు కేసు: వైఎస్ ప్రతాపరెడ్డి కార్యాలయంలో పోలీసులు సోదాలు

By Siva KodatiFirst Published May 15, 2021, 5:14 PM IST
Highlights

కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి కార్యాలయంలో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. పులివెందులలోని ఆయన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి కార్యాలయంలో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. పులివెందులలోని ఆయన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని సైతం ప్రశ్నించారు. పేలుడు పదార్థాలు ఎలా నిల్వచేస్తారు? ఎక్కడ నుంచి తెస్తారు? ఎవరికి విక్రయిస్తారు? ఇటీవలికాలంలో ఎవరెవరికి విక్రయించారు? తదితర వివరాలపై పోలీసులు ఆరా తీశారు.

మామిళ్లపల్లి క్వారీలో మే 8న జరిగిన పేలుడు ఘటనలో 10 మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 11న వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read:మామిళ్లపల్లి పేలుడు కేసు: జగన్ కుటుంబంలో అరెస్ట్ కలకలం.. పోలీసుల అదుపులో వైఎస్ ప్రతాపరెడ్డి

ఈ క్రమంలో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు తేలింది. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా వీటిని తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

వైఎస్ ప్రతాప్‌రెడ్డి... కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న. ఆయనకు పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది. దీనిలో భాగంగా ఘటన జరిగిన రోజున పులివెందుల నుంచి మామిళ్లపల్లె గనులకు జిలెటన్‌ స్టిక్స్‌ తరలించి అక్కడ అన్‌లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.

click me!