
కాపు నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుండి మొదలుపెట్టాలనుకుంటున్న పాదయాత్రను వీలైనంతలో విఫలం చేయాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు పోలీసులను పూర్తిగా వాడుకుంటోంది. రేపటి ముద్రగడ యాత్రలో పాల్గొనేందుకు లేదని, ఎవ్వరూ పాల్గొన వద్దని పోలీసులు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని వైసీపీలోని కాపు నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి నోటీసుల పర్వాన్ని పోలీసులు మొదలుపెట్టటం గమనార్హం.
పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం, యాత్రను నిర్వహించితీరాలని ముద్రగడ, పలువురు కాపు నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. దాంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాజధాని జిల్లాల్లో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అదునుగా పాదయాత్రలో పాల్గొంటారని అనుమానం ఉన్న వైసీపీ నేతలపైన కూడా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తోంది.
తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ కాపు నేతలకు మంగళవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రకు వెళ్లొద్దంటూ ఇళ్లకు వెళ్ళి మరీ వార్నింగ్‌లు ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే, వైఎస్‌ఆర్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, వెలనాటి మాధవ, కొక్కిరాల సంజీవరావు, నాగిశెట్టి బ్రహ్మయ్యలకు పోలీసులు నోటీసులిచ్చారు.
నేతలకే కాకుండా ఆందోళనకారులకు ప్రయాణాలకు వాహనాలను సమకూర్చకుండా ట్రావెల్స్ నిర్వాహకులను కూడా పాదయాత్రకు వాహనాలు సమకూర్చొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పనిలో పనిగా అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో కాపు నేతలూ నోటీసులు అందుకుంటున్నారు. ముద్రగడ పాదయాత్రలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరికలు చేసి వదిలిపెడుతున్నారు. మరి పోలీసుల హెచ్చరికలతో కాపు సామాజికవర్గంలో ఒక విధమైన అసంతృప్తి మొదలైంది. మరి ఈ అసంతృప్తి దేనికి దారితీస్తుందో చూడాలి.