
తెలుగుదేశంపార్టీలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎంఎల్సీ వైసీపీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ నేత ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఈ మేరకు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఎప్పుడవసరం వచ్చినా సరే వెంటనే టిడిపి వదిలేసి వైసీపీలోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లు సదరు నేత జగన్ తో చెప్పారని తెలిసింది. ప్రస్తుత టిడిపిలో సదరు నేతకు పార్టీలోని నేతలతో పెద్దగా సంబంధాలు లేవనే చెప్పాలి. ఏదో పార్టీలో ఉన్నారు కాబట్టి అవసరం మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంతే.
పార్టీ మారే సమయంలో అవసరమొచ్చినపుడు తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేస్తారా? లేక రాజీనామా చేయకుండానే వైసీపీలోకి వెళతారా అన్నది అప్పటి పరిస్ధితులను బట్టి నిర్ణయమవుతుందట. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్ధానంలో పోటీ చేయాల్సిందిగా సదరు నేతను జగన్ కోరినట్లు సమాచారం. కాగా ప్రస్తుత పార్లమెంటు సభ్యునిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి సేవలను వచ్చే ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ఉపయోగించుకోవాలని కూడా జగన్ నిర్ణయించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వైవికి వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నేతలను సమన్వయపరిచే బాధ్యతను అప్పగించినట్లు కూడా సమాచారం.