వెండి సింహాల మాయం కేసు... ఆ నలుగురిని విచారిస్తున్న పోలీసులు

By Arun Kumar PFirst Published Sep 22, 2020, 6:38 PM IST
Highlights

రాజకీయంగానే కాకుండా హిందువుల మనోబావాలకు సంబంధించిన అంశం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మ రధంపైని వెెండి సింహాల మాయం కేసు దర్యాప్తులో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రధానికి అలంకారంగా ఏర్పాటుచేసిన సింహాల ప్రతిమలు మాయమైన విషయం తెలిసిందే. నాలుగు సిహాలలో మూడింటిని ఎవరో చోరి చేశారు. అయితే ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలోనే ఈ విషయం బయటపడటంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది.  విగ్రహాల ఛోరీ మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలోనే అంటూ వైసిసి, టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

ఇదిలావుంటే రాజకీయంగానే కాకుండా హిందువుల మనోబావాలకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు కూడా ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ వెండి సింహాల దొంగలను త్వరగా పట్టుకునేందుకు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రధం నిలిపివుంచిన ప్రాంతానికి దగ్గర్లోని శివాలయం వద్ద పనులుచేసిన వర్కర్లను పోలీసులు విచారిస్తున్నారు. 

పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీల నుంచి వర్కర్లను తీసుకు వచ్చిన నలుగురు తాపీ మేస్త్రిల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు, లాక్ డౌన్ తర్వాత దాదాపు 21 నెలల పాటు శివాలయంలో వీరు పనులు చేశారు. దీంతో ప్రతిమల చోరీతో వీరికి ఏమయినా సంబంధం వుందా అన్నకోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. 

read more  దుర్గగుడి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం: కీలక విషయాలు గుర్తింపు

ఇప్పటివరకు ఈ చోరీ విషయంలో పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. రథంపై ఉన్న సింహాల ప్రతిమలను దొంగలు స్క్రూలు విప్పి తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో రథం స్క్రూల్ రాకపోకవడంతో ఆ విగ్రహాన్ని పెకిలించే ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో విగ్రహాన్ని రథం నుండి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతోనే నిందితులు విగ్రహాన్ని వదిలి  వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 2002లో ఈ రథాన్ని తయారు చేశారు. ఉగాది సమయంలో రథాన్ని బయటకు తీస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది రథాన్ని బయటకు తీయలేదు. ఈ రథంపై ఉన్న సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాత నేరస్తులు ఈ  విగ్రహాల ప్రతిమలను చోరీ చేశారా? అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ రచ్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో కనకదుర్గ ఆలయంలో చోరీకి గురైంది. ఆ సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విషయమై  అప్పట్లో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది.
 


 

click me!