బాబాయి, అబ్బాయిలపై కేసు.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడులపై కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు..

By team teluguFirst Published Nov 3, 2021, 11:51 AM IST
Highlights

తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడులపై (Ram Mohan Naidu) పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు 48 మంది టీడీపీ కార్యకర్తలపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడులపై (Ram Mohan Naidu) పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు 48 మంది టీడీపీ కార్యకర్తలపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు‌తో టీడీపీ ముఖ్య నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రనాయుడు వర్దంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 

మంగళవారం శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడు ఆవిష్కరించారు. అయితే అంతకు ముందు జిల్లాలో కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో తెలుగుదేశం శ్రేణుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుతో కలసి నందిగాం మండలంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే అట్టాడ జనార్ధన నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. 

Also read: చట్టాలను గౌరవించరు.. చట్టాలు చేయమంటారా: వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీల ఫైర్

వారి ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో పోలీసుల తీరు పట్ల అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము విగ్రహావిష్కరణకు వెళుతున్నామని.. విధ్వంసాలకు కాదన్నారు. ప్రజా నాయకుల విగ్రహా అవిష్కరణలకు వెళ్లటానికి పోలీసుల అనుమతి అవసరమా? అంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం టెక్కలి మీదుగా నందిగాం వరకు TDP శ్రేణుల ర్యాలీ జరిపారు. 

Also read: జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐపై హైకోర్టు ఆగ్రహం.. ‘అవసరమైతే సిట్ వేస్తాం’.. సాయంత్రానికల్లా ఉత్తర్వులు

అయితే.. టీడీపీ ర్యాలీ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మోటార్ వాహన చట్టాన్ని కూడా అతిక్రమించారని వీఆర్వో ఆరంగి మహేశ్వరరావు tekkali పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చర్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కరోనా నిబంధనల విషయంలో పోలీసులు.. అధికార పార్టీ నేతల విషయం ఒకలా.. టీడీపీ నేతల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక కారణంతో టీడీపీ నేతలపై కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!