గుంటూరులో చంద్రన్న కానుక సభలో తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు..

By Sumanth KanukulaFirst Published Jan 2, 2023, 10:31 AM IST
Highlights

గుంటూరులో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.

గుంటూరులో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సరైన రక్షణ చర్యలు తీసుకోని కారణంగా సభ నిర్వాహకులపై నల్లపాడు పోలీసు స్టేషన్‌లో 304, 174 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులు, విచారణలో వెలుగుచూసే విషయాల ఆధారంగా కేసులో మార్పులు జరిగే అవకాశం ఉందని పోలీసుల వర్గాలు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. 

ఆదివారం ఘటన చోటుచేసుకున్న వెంటనే.. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రాంగణాన్ని పరిశీలించి తొక్కిసలాటకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. మహిళలు ఒక్కసారిగా మొదటి కౌంటర్ వద్దకు దూసుకెళ్లినప్పుడు.. క్యూ లైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు వారిపై పడ్డాయని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఇది మిగిలిన మహిళల్లో మరింత భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. అయితే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ తొక్కిసలాట జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు. 

అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు సభలో ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక్కరు ఘటన స్థలంలో మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలువురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు బుధవారం ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

అయితే సభ వద్ద అందించే ఉచిత రేషన్‌ కిట్‌లను స్వీకరించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఉచిత రేషన్‌ కిట్‌లను అందుకునేందుకు ప్రజలు ఒకరితో ఒకరు తోపులాటకు దిగడంతో తొక్కిసలాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లు జనాన్ని అదుపు చేయలేకపోయారు. తొక్కిసలాటను గమనించిన టీడీపీ నేతలు వెంటనే కిట్ల పంపిణీని నిలిపివేశారు. జారీ చేసిన కూపన్లందరికీ కిట్‌లను డోర్ డెలివరీ చేస్తామని వారు ప్రకటించారు.

ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు గాయపడిన వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50000 చొప్పున ముఖ్యమంత్రి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఉచిత రేషన్ కిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి, మృతుల సమీప బంధువులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

ఈ తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరైన సభకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. మరోవైపు ముగ్గురి మృతికి కారణమైన చంద్రబాబు నాయుడుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

click me!