
హైదరాబాద్ : బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించనున్నట్లు సమాచారం. సోమవారం బీఆర్ఎస్ పార్టీలో ఏపీ మాజీమంత్రి, మాజీ ఐఆర్టీఎస్ అధికారి రావెల కిషోర్ బాబు, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాష్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథిలతో పాటు మరికొంతమంది బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నేడు జరగనున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తారు.
టిఆర్ఎస్ జాతీయ స్థాయి పార్టీ.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించే దిశగా అధిష్టానం ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల నాయకులతో చర్చలు జరుపుతుంది. ఈ చర్చలో భాగంగానే పార్థసారథి, చంద్రశేఖర్, కిషోర్ బాబు.. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర కేడర్లో ఐఏఎస్గా 23 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 2009లో ఆ పదవికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీ లో చేరారు. గుంటూరు లోక్సభ స్థానానికి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ఓడిపోయారు.
వైకుంఠఏకాదశి వేడుకలు : తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజామునుంచే దర్శనాలు..
ఆతర్వాత 2014లో వైసిపిలో చేరి ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇక రావెల కిషోర్ బాబు 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. అయినా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ మీద 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికలనాటికి టిడిపి నుంచి జనసేనకు మారారు. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కొంతకాలానికి దానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరబోతున్నారు.
2019లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి చింతల పార్థసారథిగారు జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. దీనికోసం ఐఆర్ఎస్ కు రాజీనామా చేసి జనసేన లో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించలేదు. ఇక టీజే ప్రకాశం ఏ తుమ్మల శెట్టి జయప్రకాశ్ నారాయణ అనంతపురం జిల్లాకు చెందినవాడు. ప్రజారాజ్యం పార్టీ తరపున 2009 ఎన్నికల్లో అనంతపురం నగర నియోజకవర్గంలో పోటీ చేశారు. కానీ అతడిని విజయం వరించలేదు. ఈ నలుగురి తో పాటు సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు టిఆర్ఎస్ లో చేరనున్నారు.