ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు.. కార్పొరేటర్ ఫిర్యాదుతో..

By Sumanth KanukulaFirst Published Feb 4, 2023, 9:46 AM IST
Highlights

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని పడారుపల్లికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని పడారుపల్లికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు ఆయనపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్యలపై కూడా కేసు నమోదైంది. తన కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే ఫొటోను తొలగించడంతో కోటంరెడ్డి తన ఇంటికి  వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందంటూ విజయభా్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు శ్రీధర్ రెడ్డితో పాటు  మరో ఇద్దరిపై సెక్షన్ 448, 363ల కింద కేసు నమోదు  చేశారు. మరోవైపు విజయభాస్కర్ రెడ్డి తన బ్యానర్లు చించివేశారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. 

ఇక, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్న శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తశుద్దితో పనిచేస్తే తనను అనుమానించారని విమర్శించారు. అనుమానించిన చోట ఉండకూడదని ఆలోచించానని.. అందుకే అధికారాన్ని వదులుకున్నానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని  తన మిత్రుడితో చెప్పిస్తారని అన్నారు. విచారణ జరపకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తన అరెస్ట్‌కు రంగం సిద్దం అని లీకులు ఇస్తున్నారని అన్నారు. తనను ఏ నిమిషమైనా అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. తనను శాశ్వతంగా జైలులో పెట్టుకోవచ్చని చెప్పుకొచ్చారు. కేసులు పెట్టి అలసి పోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదని చెప్పారు. 

తన గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారమని.. తనను ఎన్‌కౌంటర్ చేయించండమేనని కోటంరెడ్డి అన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడా అనేది ప్రభుత్వం చేతిలో పని అని అన్నారు. ఇప్పుడు తాను రాజీనామా చేసినా ఎన్నికలు ఎలాగూ జరగవని అన్నారు. 
 

click me!