వల్లభనేని వంశీ వర్గం శిబిరంపై పోలీసు దాడి: హాట్ టాపిక్

By telugu teamFirst Published Jan 18, 2020, 4:27 PM IST
Highlights

వైసీపీ గన్నవరం ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు వర్గం శిబిరాన్ని వదిలేసి దాని వెనక ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గం శిబిరంపై పోలీసులు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల శిబిరంపై పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా బావులపాడు మండలం అంపాపురంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహించిన కోడిపండేలు, జూద శిబిరాలు నిర్వహించారు. వాటిపై దాడి చేసే క్రమంలో పోలీసులు వంశీ వర్గీయుల శిబిరంపై దాడి చేశారు. 

పక్కపక్కనే రెండు శిబిరాలు ఉన్నప్పటికీ ఓ శిబిరాన్ని వదిలేసి వంశీ వర్గం శిబిరంపై దాడి చేయడంలోని మతలబు ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గన్నవరం ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు గ్రామంలో రోడ్డు పక్కనే శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాని వెనక వంశీ వర్గీయుల శిబిరం ఉంది. 

యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల శిబిరాన్ని వదిలేసి వంశీ వర్గీయుల శిబిరంపై పోలీసులు ఎందుకు దాడి చేశారనే సందేహం వ్యక్తమవుతోంది. ఆ శిబిరంపైనే ఫిర్యాదులు వచ్చాయని, అందుకే దాడులు నిర్వహించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

సంక్రాంతి రోజు రాత్రి వంశీ వర్గానికి చెందిన శిబిరంపై దాడి చేసి పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు దాదాపు రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండో శిబిరానికి వెళ్లే లోపే వారు జారుకున్నారు. 

వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య విభేదాలున్నాయి. ఇలాంటి స్థితిలో ఓ వర్గం శిబిరాన్ని వదిలేసి మరో వర్గం శిబిరంపై పోలీసులు దాడి చేయడం ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు. 

click me!