
చంద్రబాబునాయుడుకు పోలవరం తలనొప్పులు తప్పేట్లు లేవు. ప్రాజెక్టును తన చేతుల్లోకి లాక్కునేటప్పుడు అప్పట్లో భవిష్యత్తులో ఎదురవ్వబోయే సమస్యలను బహుశా చంద్రబాబు ఊహించుండరు. అందుకే ఇపుడు ఆ సమస్యల్లో నుండి బయటపడటానికి నానా అవస్తులు పడుతున్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలు 100 శాతం కేంద్రానిదే. అయితే, ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే తనకు వచ్చే లాభమేంటని అప్పట్లో చంద్రబాబు ఆలోచించారు. అందుకనే విభజన చట్టాన్ని ఉల్లంఘించి మరీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను లాక్కున్నారు. దాంతో కేంద్రం కూడా అన్నీ కోణాల్లో ఆలోచించి భారాన్ని వదిలించుకుంది. దాంతో అదికాస్త చంద్రబాబుకు ఇపుడు తలనొప్పిగా మారింది.
ప్రాజెక్టు సాంకేతిక సమస్యలు ఎలాగున్నా వచ్చే ఎన్నికల్లో పోలవరం మాత్రం ఓ రాజకీయ అంశమవటం ఖాయం. ఇప్పటికే వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఈ అంశంలో చంద్రబాబును తప్పుపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి అందరకీ తెలిసిందే. దాన్ని బట్టి చూస్తే పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం చేతిలోనే ఉన్నా పరిస్ధితి ఇంతకన్నా భిన్నంగా ఉండేదికాదనటంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే, ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, రెవిన్యూలోటు భర్తీ విషయంలో కేంద్ర వైఖరి చూస్తే ఆ విషయం సులభంగా అర్దమైపోతుంది.
కాకపోతే చంద్రబాబు ఒకటనుకుంటే, ప్రధానమంత్రి ఇంకోటి చేస్తున్నారు. నిజానికి పోలవరం సమస్యల విషయంలో చంద్రబాబుదే పూర్తి బాధ్యత. కేంద్రం అనుమతి లేకుండానే అంచనా వ్యయాలను రూ. 16 వేల కోట్ల నుండి రూ. 58 వేల కోట్లకు పెంచేసారు. ప్రాజెక్టును చేపట్టే సామర్ధ్యం లేదని తెలిసీ కేవలం తమ పార్టీ ఎంపి అని ట్రాన్ స్ట్రాయ్ కే అప్పగించారు. కేవలం కాసుల కక్కుర్తి కోసమే చంద్రబాబు ఈ పని చేసారని వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చూడబోతే వారి ఆరోపణలే నిజమనిపిస్తున్నాయి.
ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, కేంద్రం వైఖరి వల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సమస్యల వల్ల 2019లోగా పోలవరం పూర్తికాదని తేలిపోయింది. అందుకనే ప్రాజెక్టు విషయంలో ‘పచ్చపత్రికలు’ కేంద్రం వైఖరిని తప్పు పడుతూ కథనాలు మొదలుపెట్టాయి. ఎందుకంటే, చంద్రబాబు ప్రతిపాదనలను కేంద్రం పూర్తిగా పక్కనపెట్టేస్తోంది. అంటే, రేపటి ఎన్నికల్లో గనుక భాజపా-టిడిపిలు విడిపోతే అప్పుడు చూడాలి పోలవరం అంశాన్ని ఎన్నికల్లో ఏ విధంగా వాడుకుంటాయో ?