సినిమా టైపులో హత్యకు పథకం

Published : Nov 11, 2017, 07:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
సినిమా టైపులో హత్యకు పథకం

సారాంశం

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫ్యాక్షన్ మళ్ళీ పడగ విప్పుతోంది. ప్రత్యర్ధి వర్గాలు ఒకే పార్టీలో ఉండటంతో ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ మొదలయ్యాయి.

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫ్యాక్షన్ మళ్ళీ పడగ విప్పుతోంది. ప్రత్యర్ధి వర్గాలు ఒకే పార్టీలో ఉండటంతో ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ మొదలయ్యాయి. అద్దంకిలో టిడిపి-కాంగ్రెస్ పార్టీల్లోని గొట్టిపాటి వర్గాల మధ్య ఉన్న దశాబ్దాల వైరం అందరికీ తెలిసిందే. కరణం బలరాం టిడిపిలో ఉంటే, గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ లో ఉండేవారు. మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో గొట్టిపాటి వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో కరణంపై గెలిచారు.

అయితే, తాజా పరిణామాల నేపధ్యంలో గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారు. గొట్టిపాటి టిడిపిలో చేరటాన్ని కరణం ఎంత వ్యతిరేకించినా అడ్డుకోలేకపోయారు. దాంతో ప్రత్యర్ధులిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. దాంతో ఎప్పుడేమి జరుగుతుందో అర్ధం కాక టిడిపి నేతలందరూ భయపడుతున్నారు. వారి భయానికి తగ్గట్లే రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ భూతం జడలు విప్పుకుంది. రెండు వర్గాల మధ్య హత్యా రాజకీయాలు మొదలయ్యాయి.

ఈ మధ్యనే కరణం వర్గానికి చెందిన ఇద్దరిని గొట్టిపాటి వర్గం హత్య చేసింది. అప్పటి కరణం వర్గం హంతకుల కోసం వెతుకుతోంది. అటువంటి పరిస్ధితుల్లో గొట్టిపాటి వర్గానికి చెందిన 15  మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాంతో వారిపై  పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత వారంతా కండీషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే వారిలో ఎవరు కూడా అద్దంకిలో అడుగుపెట్టేందుకు లేదని గుంటూరులోనే ఉండాలని కండీషన్ పెట్టింది కోర్టు.

గురువారం అద్దంకి కోర్టులో కేసు విచారణ జరిగింది. విచారణకు హాజరయ్యేందుకు 15 మందీ కారులో అద్దంకి బయలుదేరారు. వీరి కదలికలపై నిఘా వేసిన ప్రత్యర్ధివర్గం వారి రాక కోసం కాచుకుని కూచింది. గుంటూరు నుండి బయలుదేరిన వారి కారు జార్లపాలెం వద్దకు చేరుకుంది. ఇంతలో ఎదురుగా ఓ టిప్పర్ వచ్చి హటాత్తుగా వారి వాహనాన్ని బలంగా ఢీ కొన్నది. దాంతో వాహనంలోని 9 మందితో పాటు డ్రైవర్ కు కూడా బలమైన గాయాలయ్యాయి.

ప్రమాదం జరగటాన్ని గమనించిన స్ధానికులు పోగయ్యారు. దాంతో టిప్పర్ కు సంబంధించిన వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు.  వేమవరం ఎస్సీ కాలనీకి చెందిన కోటేశ్వరరరావు, ఎల్లారావు టిప్పర్ ను 11 రోజుల క్రితమే కొన్నట్లు తేలింది. అయితే, వారు పరారీలో ఉన్నారు. దాంతో పోలీసులకు ప్రత్యర్ధివర్గంపై అనుమానాలు బలపడ్డాయి. ముందుజాగ్రత్తగా పోలీసులు వేమవరంలో పోలీసు భద్రత పెంచారు. ఎప్పుడేం జరుగుతుందో తెలీక స్ధానికులు ఆందోళనలో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu