
చూడబోతే వచ్చే ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టే మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టేట్లు కనబడుతోంది. ఎందుకంటే, కొంతకాలంగా ప్రాజెక్టు చుట్టూ మొదలైన రాజకీయాలు అదే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయటానికి అవసరమైన నిధులను కేంద్రప్రభుత్వం ఇవ్వటం లేదని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో ‘ప్రాజెక్టు ఏ కారణం వల్ల ఆలస్యమైతే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కానీ కేంద్రానికి ఏమీ సంబంధం లేద’ని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.
అంటే, జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? వచ్చే ఎన్నికల్లో రాజధాని, పోలవరం ప్రాజెక్టును చూపించి ఓట్లడగాలన్నది చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకని రాజధాని నిర్మాణం సంగతి ఎలాగున్నా పోలవరం ప్రాజెక్టునైనా పూర్తి చేయాలని చంద్రబాబు అనుకున్నారు.
అయితే, కాంట్రాక్టు సంస్ధ టాన్ స్ట్రాయ్ పెద్ద అడ్డంకిగా మారింది. దాంతో గడచిన మూడున్నరేళ్ళుగా పోలవరం పనులు అనుకున్నంతగా ముందుకు సాగలేదు. కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు లెక్కలు చెప్పటం లేదు. రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెప్పటం లేదు కాబట్టి కేంద్రం నిధులను నిలిపేసింది. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లోగా పోలవరం పూర్తి కాదన్న విషయం అందరకీ అర్ధమైపోయింది.
అందుకే మెల్లిగా పోలవరం పూర్తి కాకపోవటానికి కేంద్రమే కారణమన్నట్లుగా చంద్రబాబు ప్రకటనలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రూ. 58 వేల కోట్లు కావాలంటున్నారు. కేంద్రం సక్రమంగా నిధులివ్వటం లేదని మొదలుపెట్టారు.
అయితే, ఇదే విషయమై రాష్ట్ర భాజపా నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తో మాట్లాడుతూ, ఏ కారణం వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యమైనా అందుకు పూర్తి బాధ్యత రాష్ట్రానిదే అని స్పష్టం చేసారట. ‘ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా సమస్యలుంటే చెప్పండని, మీకంటే వేగంగా..ఇంకా తక్కువ ఖర్చుతో కడతామని ఇదివరకే రాష్ట్రానికి చెప్పా’మని గడ్కరి అన్నారు.
అంటే అర్ధమేంటి? వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు విడిగా పోటీ చేయాల్సి వస్తే ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టే కీలకంగా మారేట్లుంది. ప్రాజెక్టు పూర్తి కాకపోవటానికి బాధ్యత ‘మీదంటే..కాదు..మీదే’ అని నిందలు వేసుకోవటానికి చంద్రబాబు-కేంద్రం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లే కనబడుతోంది.