మోదీతో సీఎం జగన్ సుదీర్ఘ భేటీ.. రెండు కీలక బిల్లలుకు మద్దతు కోరిన ప్రధాని..!!

Published : Jul 06, 2023, 10:15 AM IST
మోదీతో సీఎం జగన్ సుదీర్ఘ భేటీ.. రెండు కీలక బిల్లలుకు మద్దతు కోరిన ప్రధాని..!!

సారాంశం

సీఎం జగన్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో వరుసగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ఏం చర్చకు వచ్చాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం(జూలై 5)వ తేదీన ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో వరుసగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ఏం చర్చకు వచ్చాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రధాని మోదీ జరిగిన సమావేశంలో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండు కీలక బిల్లుల ఆమోదం కోసం సీఎం జగన్‌ మద్దతును మోదీ కోరినట్టుగా సమాచారం. 

ప్రధాని మోదీతో సీఎం జగన్ దాదాపు గంటన్నర పాటు సమావేశం అయ్యారు. మోదీతో సీఎం జగన్ ఇంతా సుదీర్ఘంగా సమావేశం కావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ సమావేశంలో జాతీయ, ప్రాంతీయ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు, జాతీయ రాజధాని సివిల్ సర్వీసెస్ అథారిటీ బిల్లు‌లను ప్రవేశపెట్టాలని బీజేపీ  నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భావిస్తోంది. అయితే ఈ బిల్లులను బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

అయితే వైసీపీ లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులతో పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. అలాగే ఎన్డీయేలో భాగస్వామి  కాకపోయినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీతో వైసీపీ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది. కేంద్రం తీసుకొచ్చిన పలు బిల్లులకు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ రెండు బిల్లలకు వైసీపీ మద్దతు తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్‌సభలో సరిపడ మెజారిటీ ఉన్నందున ఆ రెండు బిల్లులు ఆమోదం బీజేపీకి సులువైన పనే అయినా.. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ మద్దతు అవసరం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ.. ఆ రెండు బిల్లుల ఆమోదం కోసం మద్దతు కోరినట్టుగా సమాచారం. 

ఇదిలా ఉంటే, ప్రధాని మోదీతో జగన్‌ భేటీ  తర్వాత ఏపీకి కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందనే వార్తలు వినిపించినప్పటికీ.. ఆ దిశగా ప్రస్తుతానికి ఎలాంటి  ప్రకటన వెలువడలేదు. మరోవైపు ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా.. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టుగా జగన్ చెప్పినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది.  
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్