
తూర్పుగోదావరి : ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయన మహిళలు, చిన్నారులతో కాళ్లు కడిగించుకున్నారు. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి, చర్చనీయాంశంగా మారింది. పెదపూడి మండలం రామేశ్వరంలో గత నెల 30న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోజు పెద్దమూడి మండలంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఈ పనికి పాల్పడ్డారు.
అక్కడున్న మహిళలు, చిన్నారులు ఆయన కాళ్ళను చేతులతో కడిగి.. పొడి బట్టతో శుభ్రంగా తుడిచారు. దీనికి ఆయన అభ్యంతరం చెప్పకపోగా.. చక్కగా కడిగించుకోవడం ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెదపూడి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బి విజయ కుమారి సమర్థించుకున్నారు. ఈమేరకు వివరణ ఇస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు ?.. మోదీ, షాలకు చెప్పిన జగన్ !
ఆ వీడియోలో మహిళలు, చిన్నారులు తమ ఇష్టాపూర్వకంగానే ఎమ్మెల్యే కాలు కడిగారని.. ‘అమ్మ ఒడి’ పథకంలో భాగంగా తమ ఖాతాలకు నగదు జమైందని.. దీంతో వారు తమ మనమరాలని ఎమ్మెల్యే కాళ్లు కడిగి సన్మానం చేద్దామని కోరడంతో చిన్నారులు కూడా ఒప్పుకున్నారని తెలిపారు. మహిళలు, చిన్నారులు కోరుకోవడంతోనే ఎమ్మెల్యే తన ఇంటికి వచ్చినప్పుడు ఇలా కాళ్లు కడిగామని సమర్థించుకున్నారు. దీని కొందరు రాజకీయం చేస్తున్నారని… అది సరికాదని తెలిపారు.
దీనిమీద ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి మండిపడుతోంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చిన్నపిల్లలతో కాళ్లు కడిగించుకోవడం ఏంటని ధ్వజమెత్తింది. ఇది చూస్తుంటే మనం రాతియుగంలో ఉన్నామా.. ఆధునిక యుగంలో ఉన్నామో అర్థం కావట్లేదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ ఘటన మీద ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు..
చిన్నారులు కాళ్లు కడుగుతుంటే వారిని వారించాల్సింది పోయి ఎమ్మెల్యే నవ్వుతూ.. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని దీన్ని ఏమనాలి అని అడిగారు. ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి గౌరవించారని.. ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేలు చిన్నపిల్లలు మహిళలతో కాళ్లు కడిగించుకుంటున్నారని ఇది హేయమైన చర్య అన్నారు. దీనిమీద సదరు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.