మోడీ పర్యటన: రాజుకుంటున్న ఎపి రాజకీయం

By pratap reddyFirst Published Feb 9, 2019, 11:55 AM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆదివారం) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏటుకూరు బైపాస్ వద్ద మోదీ బహిరంగ సభ జరుగుతుంది. మోడీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు రాజుకుంటున్నాయి. మోడీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా, మోడీ పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆదివారం) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏటుకూరు బైపాస్ వద్ద మోదీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజా చైతన్య సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి సమీపంలో ప్రధాని కోసం మూడు హెలీపాడ్‌లు సిద్ధం చేశారు. 

ఇందులో భాగంగా ఎస్పీజీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మోడీ పర్యటనకు ప్రజలు వచ్చేందుకు వాహనాలు లభించకుండా అధికార తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కన్నా విమర్శించారు. 

ఇందుకు నిరసనగా శనివారం ట్రాన్స్ పోర్టు కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే, శనివారం సెలవు కావడంతో ధర్నాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు అక్రమ సంబంధం అంటగట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మోడీ పర్యటనను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్దమవుతున్నాయి. తాము అరెస్టులకు కూడా సిద్దమేనని సిపిఐ, సిపిఎం నాయకులు ప్రకటించారు. మోడీ గో బ్యాక్ అంటూ నిరసన తెలియజేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు మధు, రామకృష్ణ తెలిపారు.

మోడీ పర్యటన పట్ల ప్రత్యేక హోదా సాధన సమితి నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడింది. మోడీకి ఖాళీ పిడతల స్వాగతం చెప్పాలని సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్త

మోడీ ఎపి పర్యటనపై చంద్రబాబు గరం: నిరసనలకు పిలుపు 

click me!