
విశాఖపట్నం: తనకు చెల్లని చెక్కు ఇవ్వడంతో తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయినట్లు వేగి శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదనను పంచుకున్నాడు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత 2015 అక్టోబర్ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందుకు సంబంధించి ప్రామిసరీ నోటు, పోస్ట్ డేటెడ్ చెక్కును అనిత ఇచ్చారు .
అయితే చాలా రోజుల పాటు ఆ చెక్కును బ్యాంకులో వేయొద్దంటూ శ్రీనివాసరావును ఆమె కోరుతూ వచ్చారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకు లోన్ పెట్టానని, వచ్చిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని అనిత చెబుతూ వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన అప్పు తీర్చాలని శ్రీనివాసరావు ఒత్తిడి చేయడం ప్రారంంభించాడు.
నిరుడు జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సివిల్ కేసుకు సంబంధించి 12వ అదనపు జిల్లా జడ్జి నుంచి కోర్టుకు హాజరు కావాలని అనితకు (ఓఎస్ నంబరు 434/2018)తో సమన్లు జారీ చేశారు.
ఇక క్రిమినల్ కేసు (సీసీ నంబరు 1919/2018)కి సంబంధించి ఈ నెల 26వ తేదీన వాయిదాకు హాజరు కావల్సి ఉంది. అధికారం తన చేతిలో ఉందని ప్రజల్ని ఇలా మోసం చేయడం సరికాదని కాంట్రాక్టర్ ఆవేదన చెందుతున్నాడు.