
‘ఒక్కసారి..ప్లీజ్ ఒక్కసారి..జగన్ కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి’ అంటూ వైసీపీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. నవంబర్ 2వ తేదీ నుండి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయనున్న విషయం అందరకీ తెలిసిందే. పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణ తదితరాలపై చర్చించేందుకు జగన్ అధ్యక్షతన వైసీపీ నేతలు బుధవారం సమావేశమయ్యారు. అనంతరం, ఎంపి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఒక్కసారి జగన్ ను సిఎం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి తన తండ్రి వైఎస్సార్ పాలనను తలపిస్తారంటూ చెప్పారు.
సిఎం కాకముందు వైఎస్ పైన కూడా అనేక అవినీతి ఆరోపణలు చేసారని, అయితే, ముఖ్యమంత్రి కాగానే బ్రహ్మాండంగా పాలించి దేశంలోనే ఎవరూ చేయనంత ప్రజారంజకంగా పాలించినట్లు చెప్పారు. అదే విధంగా జగన్ కూడా మంచి పాలనను అందిస్తారన్న నమ్మకం తమకుందన్నారు. ఒకవేళ ప్రజలు అనుకున్నట్లు జగన్ పాలన లేకపోతే 2024లో నిర్ణయం తీసుకునే అవకాశం జనాలకు ఎప్పుడూ ఉంటుంది కదా? అన్నారు.
జగన్ పాదయాత్ర గురించి వివరిస్తూ, 6 మాసాల పాటు సాగే పాదయాత్రలో 120 నియోజకవర్గాలను జగన్ కవర్ చేస్తారని చెప్పారు. మిగిలిన 55 నియోజకవర్గాల్లో జగన్ బస్సుయాత్ర చేస్తారని చెప్పారు. పాదయాత్ర జరిగిన ప్రతీ నియోజకవర్గంలోనూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారం కోసం అక్కడి అధికారులతో మాట్లాడుతారట. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్న ఉద్దేశ్యంతోనే తాము కూడా సిద్దమవుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చని ప్రచారం జరుగుతున్న విషయాన్ని ఎంపి ప్రస్తావించారు.
చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు భ్రష్టుపట్టించారంటూ ధ్వజమెత్తారు. అన్నీ వ్యవస్ధలనూ సిఎం నాశనం చేసినట్లు మండిపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేకహోదాను కూడా కాలరాసిన వ్యక్తిగా చంద్రబాబుపై మండిపడ్డారు. వ్యవస్ధలను మ్యానేజ్ చేయటంలో, ప్రజలను భ్రమల్లో ఉంచటంలోను, మీడియాను మ్యానేజ్ చేయంటలోనూ చంద్రబాబును మించిన వ్యక్తి లేరని, చంద్రబాబు నైపుణ్యంలో, తెలివితేటల్లో చంద్రబాబు చాలా గొప్పవారని తామూ అంగీకరిస్తున్నట్లు మేకపాటి ఎద్దేవా చేసారు. చంద్రబాబు కబంధహస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకే ఒక్కసారి వైసీపీకి మద్దతు ఇవ్వాలంటూ మేకపాటి జనాలను మేకపాటి అభ్యర్ధించారు.