
రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ పథకాలు అమలవుతున్న విధానాలపై భారతీయ జనతా పార్టీ రహస్యంగా విచారణ చేయిస్తోందా ? మంగళవారం జరిగిన భాజపా కార్యవర్గ సమావేశాల్లో చర్చలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇంటింటికి మరుగుదొడ్డి, ఉపాధిహామీ పథకం, నీరు-చెట్టు, గృహనిర్మాణ పథకం తదితరాల్లో భారీగా అవినీతి జరుగుతోందని భాజపా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయట.
పై పథకాలన్నీ అమలు చేయాల్సింది రాష్ట్రప్రభుత్వమే అయినప్పటికీ నిధులంతా కేంద్రప్రభుత్వానిదే అన్న విషయం అందరికీ తెలిసిందే. పథకాల అమలు బాధ్యత ఎప్పుడైతే రాష్ట్రప్రభుత్వం చేతికొచ్చిందో అక్కడే అవినీతికి తెరలేచిందన్నది భాజపా నేతల భావన.
ఎలాగంటే, పథకాల అమలులో అడుగడుగునా తెలుగుదేశంపార్టీ నేతల జోక్యమే కనిపిస్తోందట. జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు, జిల్లామంత్రులు, నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, నేతల ఇష్టారాజ్యంతోనే కేటాయింపులు జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఆ కేటాయింపుల్లోనే కాకుండ పనులు చేపట్టటంలో కూడా అధికారపార్టీ నేతల చేతివాటం బహిరంగ రహస్యం. కాబట్టే పథకాల అమలు మొత్తాన్ని టిడిపి నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారన్నది భాజపా నేతల ఆరోపణ.
ఇక్కడే అవినీతికి భారీగా తెరలేచిందట. చేసిన పనులే చేయటం, ఒకే పనికి మూడు నాలుగు సార్లు బిల్లులు మంజూరు చేయించుకోవటం, గతంలో కట్టిన మరుగుదొడ్లు, ఇళ్ళు, నాటిన మొక్కలు తదితరాల రూపంలో కోట్లాది రూపాయలను టిడిపి నేతలు సొమ్ము చేసుకున్నారని స్ధానిక భాజపా నేతల నుండి భాజపా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయట. అటువంటి ఆరోపణలపైనే భాజపా రాష్ట్రవ్యాప్తంగా విచారణ చేయిస్తోందన్నది తాజా కబురు. సరే, దాన్ని అడ్డుకోవటానికి భాజపాలో ఎటూ టిడిపి మద్దతుదారులుంటారు కదా? సమస్య మొత్తం అక్కడే వస్తోంది మొదటినుండి.
ఇదే అంశంపై తాజాగా జరిగిన భాజపా కార్యవర్గ సమావేశంలో హాటుహాటుగా చర్చ జరిగిందట. కేంద్రపథకాలు రాష్ట్రంలో దుర్వినియోగమవుతున్న తీరుపై పలువురు జిల్లాల నేతలు చర్చించాలని పట్టుబట్టారట. అయితే, రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అంగీకరించలేదట. మొత్తం మీద కార్యవర్గంలో మెజారిటీ సభ్యులు హరిబాబు వ్యవహారశైలిపై తీవ్రంగా ధ్వజమెత్తారన్నది ఇన్ సైడ్ టాక్.
ఒకపుడు కార్యవర్గ సమావేశాలంటే రెండు రోజుల పాటు జరిగేదని, కానీ ఇపుడు కేవలం అరపూట జరిపూసి చేతులు దులుపుకుని వెళుతున్నట్లు మండిపడ్డారట పలువురు. కేవలం ధన్యవాదాలు తెలిపేసి సమావేశాలు ముగించేట్లయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుండో రావటం ఎందుకంటూ నిలదీసారట. అయితే అధ్యక్షుడి నుండి సమాధానం లేదనుకోండి. సరే, పనిలోపనిగా వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు వద్దని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారట. భాజపా నేతల పట్ల చంద్రబాబు వైఖరిని పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారని సమాచారం. మొత్తం మీద కార్యవర్గ సమావేశం చాలాచాలా హాటుహాటుగా జరిగిందనేది వాస్తవం.