కమ్యూనిస్టులకన్నా చంద్రబాబే ప్రమాదకరమా ?

First Published Oct 11, 2017, 12:23 PM IST
Highlights
  • కేరళలో కమ్యూనిస్టులతో కన్నా ఏపిలో చంద్రబాబుతోనే చాలా ప్రమాదమా?
  • ఎలాగబ్బా? కేరళలో అంటే  భాజపా ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నదేమో కమ్యూనిస్టులు.
  • కాబట్టి రెండు పార్టీల నేతల మధ్య గొడవలవుతున్నాయి.
  • అంతవరకూ బాగానే ఉంది.
  • మరి ఏపిలో టిడిపి-భాజపాలు మిత్రపక్షాలే కదా?

కేరళలో కమ్యూనిస్టులతో కన్నా ఏపిలో చంద్రబాబుతోనే భాజపాకు చాలా ప్రమాదమా? ఎలాగబ్బా? కేరళలో అంటే  భాజపా ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నదేమో కమ్యూనిస్టులు. కాబట్టి రెండు పార్టీల నేతల మధ్య గొడవలవుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. మరి ఏపిలో టిడిపి-భాజపాలు మిత్రపక్షాలే కదా? భాజపాతో కమ్యూనిస్టులకన్నా చంద్రబాబుతోనే ఎక్కువ ప్రమాదమని భాజపా నేతలు ఎందుకు భయపడుతున్నారు?

అంటే, కేరళ తరహాలో ఏపిలో భాజపా నేతలపై దాడులు జరుగుతాయని కాదట. చంద్రబాబు ఏపిలో అసలు భాజపానే లేకుండా చేస్తారేమో అని అనుమానమట. అందుకే కేరళ కమ్యూనిస్టుల కన్నా ఏపిలో చంద్రబాబుతోనే ఎక్కువ ప్రమాదమని భాజపా నేతలు భయపడుతున్నారు.

ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు వద్దే వద్దంటున్నారు. అదే విషయాన్ని గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాల నేతలు పలువురు కుందబద్దలు కొట్టినట్లు చెప్పారు. కార్యవర్గంలో అత్యధికులు వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు.

కార్యవర్గ సమావేశంలో కేరళలో భాజపా నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయం ప్రస్తావనకు వచ్చిందట. వెంటనే పలువురు నేతలు జోక్యం చేసుకుని ఎక్కడో కేరళలో పార్టీ పరిస్ధితిని చర్చించేబదులు ముందు ఏపిలో పార్టీ పరిస్ధితిపై చర్చించాలంటూ డిమాండ్ చేసారట. గడచిన మూడున్నరేళ్ళల్లో చంద్రబాబునాయుడు ఏనాడూ భాజపా నేతలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. మిత్రపక్షమే అయినా అందరు నేతలకూ కనీస మర్యాద కూడా టిడిపి ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు.

అడుగడుగునా అవమానిస్తున్న టిడిపితో ఇంకా ఎందుకు కలిసుండాలంటూ పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును నిలదీసారట. కేంద్రపథకాల అమలులో అవినీతి జరుగుతున్నా కనీసం అడిగేందుకు కూడా లేకుండా నోళ్ళు కట్టేస్తున్నారంటూ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారట.

కాబట్టి, వచ్చే ఎన్నికల వరకూ వేచివుండకుండా ఇప్పటి నుండే ఒంటరిపోరుకు సిద్దపడాలంటూ నేతలు గట్టిగా పట్టుబట్టారట. వచ్చే ఎన్నికలకు ముందు భాజపాతో పొత్తును చంద్రబాబే తెంచుకుంటే అప్పుడు మనం ఏ విధంగా జనాల్లోకి వెళ్ళగలమంటూ పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రశ్నించారట. సరే, రాష్ట్ర అధ్యక్షుడు ఏం సమాధానం చెప్పలేదనుకోండి అదివేరే సంగతి. పార్టీ బలమెంతో తెలియాలంటే ఒంటరిగా పోటీ చేయాల్సిందే అంటూ మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారట. మెజారిటీ నేతల వాదన చూస్తుంటే, వారి ఆందోళనను కొట్టి పారేసేందుకు లేదనే అనిపిస్తోంది.

click me!