
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వరుణదేవుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగని వైఎస్సే ఒకసారి అన్నారు లేండి. వరుణదేవుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు కాబట్టే వర్షాలు బాగా పడుతున్నాయని వైఎస్ అప్పట్లో చెప్పుకునేవారు. అదేవిధంగా, ఇపుడు గ్రహాలన్నీ వైసీపీలో చేరినట్లే ఉన్నాయ్. ఉగాది సందర్భంగా పలువురు సిద్ధాతులు చెబుతున్న విషయాలను చూస్తుంటే గ్రహాలపై అనుమానం వస్తున్నది.
నూతన సంవత్సరంలో పరిస్ధితులు జగన్ కు బాగా అనుకూలంగా ఉంటాయని సిద్దాంతులు చెబుతున్నారు. ఎవరో ఒకరు చెప్పారంటే ఏదోలే అనుకోవచ్చు. ఎందుకంటే, పంచాగశ్రవణం చేసే సిద్దాంతులు పార్టీలను బట్టి మాట్లాడుతున్నారు. టిడిపి కార్యాలయంలో పంచాగశ్రవణం చేసే సిద్ధాంతి చంద్రబాబుకు బ్రహ్మాండమటారు. అదే వైసీపీ కార్యాలయంలో పంచాగశ్రవణం వినిపించే సిద్ధాంతి జగన్ కు ఎదురేలేదని చెబుతారు. ఇక, భాజపా కార్యాలయం, కాంగ్రెస్ కార్యాలయంలో కూడా అదే పద్దతి. ప్రభుత్వం నిర్వహించే పంచాంగశ్రవణంలో మాత్రం ఎందుకైనా మంచిదని మిశ్రమ ఫలితాలు ఉంటుందని చెబుతారు.
పంచాంగశ్రవణం ఇన్ని రకాలుగా ఎలా ఉంటాయో సిద్ధాంతులే చెప్పాలి. ఎవరికైనా గ్రహాలు ఒకటే. వాటి ప్రభావాలు, ఫలితాలు ఒకే విధంగా ఉండాలి. పార్టీ కార్యాలయాలను బట్టి, సిద్ధాంతులను బట్టి భవిష్యత్ మారిపోవటం ఏమిటో వారికే తెలియాలి. అటువంటిది బుధవారం పంచాగశ్రవణం సందర్భంగా ముగ్గురు సిద్ధాంతులు రాబోయే కాలం జగన్ కు అత్యంత అనుకూలమని చెప్పటంతో గ్రహాలు కూడా వైసీపీ సభ్యత్వాలు తీసుకున్నాయేమోనని అనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల్లో ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఒకరు. ఆయన ఓ ఇంగ్లీష్ దినపత్రికతో మాట్లాడుతూ, తెలంగాణా అభివృద్ధి పధంలో నడుస్తుందని చెప్పారు. అలాగే, ఏపిలో మాత్రం ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి మరింత దారుణంగా మారుతుందన్నారు. రాజకీయంగా జగన్ కు అత్యంత అనుకూలంగా ఉంటుందని జోస్యం చెప్పారు. వైసీపీ ట్రెండ్ కొనసాగుతుందన్నారు. పైగా వైసీపీ పాపులారిటీ అమాంతం పెరిగిపోతుందని చెప్పటం గమనార్హం. ప్రజల మనస్సులను జగన్ గెలుచుకుంటారట. ప్రతిపక్ష నేత ప్రజల మనస్సులను గెలుచుకోవటం అంటే అర్ధమేమిటి?
అదేవిధంగా, శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ దేశ, రాష్ట్రాల్లో పాలించే వాళ్ళకు గడ్డుకాలమని చెప్పారు. పాలితులకు గడ్డుకాలమంటే అంటే ఏమిటి? ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబే కదా? అలాగే, ఇటీవల ప్రముఖునిగా చెలామణి అవుతున్న వేణుస్వామి మాట్లాడుతూ, జగన్ కేసులను తిరగతోడుతారని అన్నారు. అయినా సరే వైసీపీ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పటం గమనార్హం. ట్రెండ్ కొనసాగటమంటే ఏమిటో? రాజకీయంగా పరిస్ధితులు జగన్ కు అనుకూలంగా మారుతాయని కూడా చెప్పారు. వీరు ముగ్గురు చెప్పే ఒకేమాట ఏమంటే రాబోయే కాలంలో జగన్ కు గ్రహబలం బాగా అనుకూలమనే. దాంతో తండ్రి వైఎస్ హయాంలో వరుణదేవుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే, కొడుకు జగన్ కాలంలో గ్రహాలన్ని కూడబల్లుకుని వైసీపీలో చేరాయేమోనని అనుమానం మొదలైంది.