
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారా? అవునని సిబిఐ అంటున్నది. అందుకనే జగన్ బైలు రద్దు చేయాలంటూ ఈ రోజు ఓ పిటీషన్ను దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళి, బెయిల్ మీదున్న జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారంటూ సిబిఐ ఆరోపించింది. బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు చేయటం గమనార్హం. సిబిఐ పిటీషన్ను స్వీకరించిన సిబిఐ కోర్టు ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలంటూ జగన్ను ఆదేశించింది.
జగన్ త్వరలో జైలుకు వెళతారంటూ టిడిపి నేతలు ఎప్పటి నుండో బహిరంగంగానే చెబుతున్న విషయం తెలిసిందే కదా. ఆ నేపధ్యంలో హటాత్తుగా సిబిఐ బెయిల్ రద్దు పిటీషన్ దాఖలు చేయటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వంపై ఏ విషయంలోనైనా విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నఅసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార పార్టీని వాయించి పడేస్తున్నారు.
ఇటువంటి సమయంలో సిబిఐ చర్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయ్. ఇదిలావుండగా జగన్ కేసుల్లో ఇంత వరకూ ఒక్క కేసులో కూడా విచారణ పూర్తి చేయలేదు. పైగా ఎవరినీ దోషిగా తేల్చలేదు. అంతేకాకుండా కేసులో ఉన్న వారిని ఒక్కొక్కరుగా కేసులతో సంబంధాలు లేవని తప్పించేస్తుండటం గమనార్హం.