
వినుకొండ :మున్సిపల్ కమీషనర్ పందులను అమ్ముకున్నాడంటూ ఏకంగా రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసారు వినుకొండ వాసులు. తమ పందులను అక్రమంగా అమ్ముకుని జీవనాధారంపై దెబ్బకొట్టారంటూ వినుకొండ కమీషనర్ పై తీవ్ర ఆరోపణలు చేసారు పెంపకందారులు. గవర్నర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పల్నాడు జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఈ పందుల పంచాయితీపై విచారణ చేపట్టారు.
డిప్యూటీ కలెక్టర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో పందుల సంచారంతో ప్రజలు రోగాల బారినపడకుండా మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ యాక్ట్ ప్రకారం పందుల పెంపకందారులకు నోటీసులు జారీచేసారు. పందుల పెంపకమే జీవనాధారం కావడంతో పెంపకం దారులు నోటీసులను పట్టించుకోకుండా ఎప్పటిలాగే వ్యవహరించడంతో కమీషనర్ చర్యలు తీసుకున్నారు.
Read More విషసర్పాలను చాకచక్యంగా పట్టేస్తాడు.. చివరికి... ఆ పాముకాటుకే....
అయితే కమీషనర్ చర్యలతో తీవ్రంగా నష్టపోయిన పందుల పెంపకందారులు న్యాయం కోసం గవర్నర్ ను ఆశ్రయించారు. తమకు జీవనాధారం అయిన పందులను కమీషనర్ అక్రమంగా అమ్ముకున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా దాదాపు 20 లక్షల రూపాయలు విలువచేసే పందులను కమీషనర్ అమ్ముకున్నారని పందుల పెంపకందారుడు కోటేశ్వరరావు మరికొందరు బాధితులతో కలిసి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసారు.
వీడియో
గవర్నర్ ఆదేశాలతో పల్నాడు కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ సి శ్రీరాములును విచారణ అధికారిగా నియమించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ వినుకొండ ఎమ్మార్వో కార్యాలయంలో బాధితులైన పందుల పెంపకందారులు, మున్సిపల్ కమీషనర్ ను విచారించారు. అనంతరం పందులు పెంచే చెక్కవాగు ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉన్నతాధికారులు ఆదేశాలతో పందుల అమ్ముకున్నారంటూ అందిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టినట్లు డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేధించనున్నట్లు శ్రీరాములు వెల్లడించారు. ఈ విచారణలో వినుకొండ ఎమ్మార్వో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.