
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మూడో రోజు సీబీఐ విచారణ ముగిసింది. ఈరోజు దాదాపు 6 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. అయితే రేపు విచారణకు రావాలో, వద్దో అన్నదానిపై శుక్రవారం రాత్రికి అవినాశ్ రెడ్డికి తెలియజేయనున్నారు . అలాగే ఇదే కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ కాసేపట్లో ముగియనుంది. అవినాష్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిందితులతో జరిపిన లావాదేవీలపై అవినాష్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
కాగా.. అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వివేకా కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రతివాదులకు సోటీసులను జారీ చేసింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ పై స్టే విధిస్తే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ నెల 24వ తేదీ వరకు ఎంపీని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై ఈ నెల 24న విచారణ చేపడుతామని న్యాయస్థానం తెలిపింది. సోమవారం అన్ని విషయాలపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ALso Read: వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్: మధ్యంతర బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
ఇకపోతే.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన రెండో భార్యగా చెబుతోన్న షమీమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. తనకు , వివేకాకు 2010లో వివాహం జరిగిందని అయితే మా పెళ్లి వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నారు. 2015లో తమకు కుమారుడు షెహన్‌షామ్ పుట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. అయితే వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డితో పాటు వివేకా కుమార్తె సునీత కూడా తనను దూరంగా వుండాల్సిందిగా బెదిరించారని షమీమ్ పేర్కొన్నారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. చివరికి చెక్ పవర్ కూడా తీసేశారని ఆమె ఆరోపించారు.
వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాష్ రెడ్డికి ఆశ వుండేదని షమీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య జరగడానికి కొద్దిగంటల ముందు కూడా తాను వివేకాతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చెక్ పవర్ తీసేయడంతో వివేకా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని షమీమ్ చెప్పారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పినట్లు షమీమ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. మరి దీనిపై వివేకా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.