చంద్రబాబు దత్తత గ్రామం గొంతెండిపోతావుంది

First Published Apr 18, 2017, 10:36 AM IST
Highlights

దత్తత తీసుకున్న ఏడాదికి  పేదలబూడొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు  చదువురాని గిరిజనులకు  అరచేతిలో స్వర్గం చూపించారు.  అర్థంకాని భాషలో మాట్లాడి పేదలబూడును స్మార్ట్ విలేజ్ చేస్తానన్నారు. మంచినీళ్లకు అయిదుకోట్లు  అక్కడిక్కడే ప్రకటించారు. ఇంతవరకు ఒక చుక్క నీరివ్వలేదు.

చిన్న బాబు లోకేశ్ ఈ రోజు ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు.

 

"రెండేళ్లలో ఆంధ్రా గ్రామాల ప్రజలంతా ఆనందంగా ఉంటారు. రెండేళ్లలో ప్రతిగ్రామానికి సిమెంట్ రోడ్డు, సమృద్ధిగా మంచినీళ్లఅందిస్తాం. పల్లెని ప్రేమించని వాడు రాజకీయనాయకుడెలా అవుతాడు." అని కూడా ప్రశ్నించారు.

 

యువరాజావారు పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా లో పర్యటిస్తూ వారిలా శెలవిచ్చారు. అయితే, కొద్దిగా తీరిక చేసుకుని, ఎపుడో ఒకసారి  ఈ విషయాన్నిఆయన వాళ్లనాయన చంద్రబాబు నాయుడికి కూడా చెప్పాలి.ఎందుకంటే, మూడేళ్లు కావస్తున్నా స్వయాన ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఒకే ఒక్క గ్రామానికి మంచినీళ్లివ్వలేకపోయారు. అక్కడ నీళ్ల కోసం జనం పడుతున్న యాతన అంతా ఇంతా కాదు.

 

ఇపుడు లోకేశ్ లాగా, మూడేళ్ల కిందట ముఖ్యమంత్రి కూడా ఒక ఉపన్యాసం దంచేసి విశాఖ ఏజన్సీ ప్రాంతంలో పేదలబూడు అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

ఆ మారు మూల  గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకున్నది ముఖ్యమంత్రి కాబట్టి ఇక ఆవూరు దశ తిరుగుతుందనుకున్నారు.  దత్తత తీసుకున్న ఏడాదికి ఆవూరొచ్చిన ముఖ్యమంత్రి అరచేతిలో స్వర్గం చూపించారు(పై ఫోటో). గిరిజనులకు అర్థంకాని భాషలో మాట్లాడి పేదల బూడును స్మార్ట్ విలేజ్ చేస్తానన్నారు. వూర్లో మంచినీళ్లకు అయిదుకోట్లు, పల్లెకొంపలో సిమెంట్ రోడ్లకు 9 కోట్లు అక్కడిక్కడే ప్రకటించారు. స్టేజి మీద కూర్చునే భాగ్యం గిరిజన మహిళలకు కూడా కల్పించి ఈ ప్రకటన చేశారు.

 

ఇపుడు ఒక ఏడాది కావస్తున్నది ఇది జరిగి. 

 

వూరి మంచినీటి సమస్య వూరి సర్పంచు ఎలా పరిష్కరించలేకపోయాడో, ముఖ్యమంత్రి కూడా అలాగే పరిష్కరించలేకపోయారు.

 

పేదలబూడు పరిధిలో  22 జనావాసాలున్నాయి. ఇపుడు ఈ వేసవిలో ప్రతిఇల్లూ నీటికోసం కటకటలాడుతూ ఉంది.  ఇదిగో ఇక్కడి ఫోటోలు చూడండి ...గిరిజన మహిళలు మంచినీళ్లను ఎలా పట్టుకుంటున్నారో. ముఖ్యమంత్రి గారి గ్రామం లో మహిళ పరిస్థితి చూస్తూంటే హృదయం కకావికలు కాలేదు? ముఖ్యమంత్రి ఆగ్రామాన్ని ఎందుకుదత్తత తీసుకోవాలి, ఎందుకు హామీలివ్వాలి, మమ్మల్నిలా ఎందుకు చంపాలని వారు వాపోతున్నారు. సిఎం వచ్చిపోయాక ఇక ఆ గ్రామం గురించి పట్టించుకున్న నాధుడేలేడు.నీళ్లు లేవు. కొండల్లో పుట్టిన బుగ్గలల నుంచి రాలుతున్న నీటిచుక్కలు పట్టుకుని వాళ్లు దాహం తీర్చుకుంటున్నారు. కనీసం చెడిపోయిన బోర్లను కూడా వారు రిపేరు చేయడం లేదు.

 

ముఖ్యమంత్రి ఈ గ్రామం దత్తత తీసుకోవడం వెనక బాక్సయిట్ రాజకీయాలున్నాయని చెబుతారు. బాక్సయిట్ కోసం గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు ఆయన  ఆరోజులో పేదలబూడును సింగపూర్ చేస్తానన్నారు. అయితే, బాక్సయిట్ వివాదాస్పదం కావడంతో ఆయన ఆవూరికి, గిరిజనులకు, గుడ్ బై చెప్పారనిపిస్తుంది. దాంతోపాటే, స్మార్ట్ విలేజ్ ప్రాజక్టును, మంచినీళ్లను కూడా మర్చిపోయినట్లున్నారు.

 

click me!