మళ్ళీ టిడిపి, భాజపా, జనసేన మధ్యే పొత్తు

First Published Apr 18, 2017, 8:43 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నది ఒక సమీకరణ. వైసీపీ- భాజపా మధ్య పొత్తుంటుదన్నది ఇంకో సమీకరణ. ఇటువంటి ఊహాగానాలతో టిడిపికి ఎక్కడ నష్టం జరుగుతుందోనన్న ఆందోళనతోనే అయ్యన్నపాత్రుడు హడావుడిగా పొత్తులపై ప్రకటించినట్లు కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి, భాజపా, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చింతకాయల బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఓవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జనాల్లో సమీకరణలపై రకరకాల ఊహాగానాలు షికార్లు కొడుతున్నాయి. ఇటువంటి నేపధ్యంలో మంత్రి మాట్లాడుతూ తమ పొత్తులపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టంగా చెబుతున్నారు.

సరే పొత్తుల విషయం చింతకాయల పరిధిలోవి కావన్న సంగతి అందరికీ తెలిసిందే కదా? కాకపోతే చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి లోకేష్ కు చింతకాయల బాగా సన్నిహితుడు కాబట్టే ఆయన చెప్పే మాటలను కాస్త ఆలోచించాలి. కాగా వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగా పోటీ చేస్తుందని స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు గతంలోనే. ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఇటీవలే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అంటే, వారిద్దరి ప్రకటనలను బట్టే రెండు పార్టీలు కూడా టిడిపితో కలిసి పోటీ చేసే యోచనలో లేవన్న విషయం చూచాయగా తెలుస్తోంది. అందుకే కొత్త సమీకరణలపై జనాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటువంటి నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నది ఒక సమీకరణ. వైసీపీ- భాజపా మధ్య పొత్తుంటుదన్నది ఇంకో సమీకరణ. చూద్దాం ఏ సమీకరణలతో పార్టీలు పోటీ చేస్తాయో.

click me!