
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్ర విమర్శలు చేశారు. గజినీ సినిమాలో హీరో సూర్యకి ఏవిధంగా మెమరీ లాస్ ఉందో.. అలాగే టీడీపీ నేతలకు కూడా ఉంది కాబోలు అని పవన్ విమర్శించారు. టీడీపీ నేతలందరు ‘ కన్వినెంట్ మెమరీ లాస్ సిండ్రోమ్’ని డెవలప్ చేసుకున్నారని పవన్ పేర్కొన్నారు. అంటే.. సందర్భాన్ని బట్టి.. ఆ విషయాన్ని మర్చిపోయినట్టుగా టీడీపీ నేతలు నటిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమయానికి, సందర్భానికి అనుకూలంగా తమ జనసేన పార్టీ మాట మార్చదని.. ఏది కరెక్ట్ అయితే.. దానికే జనసేన మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ని బలహీనపరిచింది ఎవరు అని పవన్ ప్రశ్నించారు.
బీజేపీతో కుమ్మక్కై హోదాని పక్కనపెట్టింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా మీరు ఎప్పటికీ మాట మర్చారనే నమ్మకం మీకు ఉందా అంటూ టీడీపీ నేతలను ఆయన ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా ఎంపీ గల్లా జయదేవ్ గతంలో మాట్లాడిన మాటలు, నిన్న పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు రెండింటిని క్లబ్ చేసి మరో ట్వీట్ చేశారు. టీడీపీకి మతిమరుపు ఏమైనా ఉందా అంటూ ఆ ట్వీట్ కి పవన్ క్యాప్షన్ జోడించారు.