
‘ఎన్నికల యుద్ధం ముందుగా వస్తే జనసేన అందుకు సిద్ధమే’ ఇది జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీటిన ట్వీటు. ట్వట్టర్లో పెద్ద జోక్ పేల్చాడనే అందరూ అనుకుంటున్నారు. జోక్ కాకపోతే మరేంటట. జనసేన ప్రారంభించి ఇప్పటికి మూడేళ్లలైంది. కానీ ఇంత వరకూ పార్టీలో పవన్ కల్యాణ్ తప్ప చెప్పుకోవడానికి మచ్చుకి రెండో వ్యక్తి కూడా లేరు. జనసేనకు రంగు రుచి వాసన మొత్తం పవనే అన్నది వాస్తవం. పార్టీకంటూ రాష్ట్రస్ధాయి నుండి గ్రామస్ధాయి వరకూ కార్యవర్గమన్నదే లేదు. ఇంత వరకూ పార్టీ సభ్యత్వం కూడా మొదలుపెట్టలేదు.
మరి, పార్టీకి అధికారికంగా ఎటువంటి కార్యవర్గం కానీ సభ్యత్వాలు కానీ లేకుండానే జనసేన ముందస్తు ఎన్నికలకు సిద్ధమని పవన్ ప్రకటించటం జోక్ లాగుంది. ఒకవైపు అధికార టిడిపి ముదస్తుకు సిద్ధమని పైకి ప్రకటిస్తున్నా లోన మాత్రం గుబులుగానే ఉంది. ఒక్క వైసీపీకి మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అన్నట్లుంది. ఎందుకంటే, చంద్రబాబుతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి వైసీపీకి. కాబట్టి సవాలంటోంది. పైగా రాష్ట్రవ్యాప్తంగా నేతలున్నారు, క్యాడర్ కూడా ఉంది. కాబట్టి వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
మరి జనసేనకు ఏముందని ముందస్తుకు రెఢీ అంటోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పటి వరకూ అందరికీ కనబడుతున్నది కేవలం పవన్ అభిమానులు, సామాజిక వర్గంలో కొంత మద్దతు మాత్రమే. ఈమాత్రం మద్దతుతోనే ఎన్నికల్లో నిలబడటం కష్టమని పవన్ కు తెలీదా? గతంలో ఓసారి మాట్లాడుతూ జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే, జనసేన తమతోనే ఉంటుందంటూ టిడిపి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ టిడిపి, భాజపాలతో కలిసి పోటీచేస్తే క్షేత్రస్ధాయి వ్యవహారాలు మిగిలిన రెండు పార్టీలు చూసుకుంటాయి.
అదే సమయంలో వైసీపీకి కూడా పవన్ దగ్గరవుతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అదే నిజమైనా వైసీపీ నేతలు, కార్యకర్తలే జనసేన తరపున మిగిలిన వ్యవహారాలు చూసుకుంటారు. పై రెండు పరిణామాల్లో ఏ ఒక్కటి నిజమైనా జనసేనకంటూ సొంతంగా పార్టీ క్యాడర్ లేకపోయినా ఏదో ఓ పద్దతిలో నెట్టుకొచ్చేయొచ్చు. అదే ఒంటరిగా పోటీ అంటే మాత్రం కష్టమే. మరి, పవన్ అంతరంగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సరే, ఓ ప్రకటనైతే పడేసాడు కదా? చూద్దాం ముందుముందు ఏం జరుగుతుందో.